ఇలా చేస్తే పిడుగులు పడవు..విద్యుత్‌ తీగల కింద.. టవర్ల దగ్గరలో ఉండొద్దు 

8 May, 2023 14:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: భూమి, మేఘాల మధ్య విద్యుత్‌ విడుదల వల్ల మెరుపులు ఏర్పడి.. భూమి మీదకు అవి పిడుగులా ప్రసరిస్తుంటాయి. వానలు కురుస్తున్నప్పుడు పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనీస జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుల బారినుంచి సునాయాసంగా రక్షించుకోవచ్చంటున్నారు. విద్యుత్‌ భద్రత డైరెక్టర్, ప్రభుత్వ ప్రధాన విద్యుత్‌ తనిఖీ అధికారి జి.విజయలక్ష‍్మి. ప్రతి ఇంటిపైనా ‘పిడుగు వాహకం’ అమర్చాలని ఆమె స్పష్టం చేశారు. వివరాలు ఆమె మాటల్లోనే.. 

నిటారుగా నిలబడొద్దు
బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌ 1752లో విద్యుత్, మెరుపుల మధ్య సంబంధాన్ని నిరూపించినప్పటి నుంచీ, వాటిని విద్యుత్‌గా మార్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. పిడుగు నుంచి వచ్చే విద్యుత్‌ నిల్వ చేయగలిగితే ఒక పిడుగు నుంచి 10 కోట్ల వాట్ల విద్యుత్‌ పొందవచ్చు. అంత శక్తి వాటిలో ఉంటుంది కాబట్టి కేవ­లం 50 మైక్రో సెకన్లలో పిడుగు ప్రభావం చూపిస్తుంది. ప్రపంచవ్యా­ప్తంగా సెకనుకు 100 పిడుగులు పడుతున్నాయనేది ఓ అంచనా. కాబట్టి పిడుగుల నుంచి రక్షణ పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇల్లు, కారు, బస్సు, రైలులో ఉన్నప్పుడు పిడుగుపాటు నుం­చి రక్షణ లభిస్తుంది. పిడుగుల శబ్దం వినిపిస్తూ.. వర్షం పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కిందకి పోకూడదు. పిడుగు ఎత్తై­న తాటి, కొబ్బరి వంటి చెట్లను వాహకంగా చేసుకుంటుంది. ఎత్తై­నవి లేనిచోట ఇతర చెట్లపై పడుతుంది. చెట్టు మీద పిడుగు పడ్డప్పుడు చెట్టు చుట్టూ తడి నేలపై 50 మీటర్ల వరకు కరెంట్‌ ప్రసరిస్తుంది. తడిసిన పూరి గుడిసెల పైన, గడ్డివాములపైన కూడా పిడు­గు పడు­తుంది.

వాన పడేటప్పుడు చెట్టు కిందకు, ఇలాంటి ప్రదేశాలకు వెళ్లకూడదు. చుట్టూ 500 మీటర్ల వరకు చెట్లు లేనప్పుడు, చెలకల వద్ద నల్లని దట్టమైన మేఘాలు (భూమి నుంచి 2 కి.మీ. ఎత్తు లోపల ఉండే క్యుములోనింబస్‌ మేఘాలు) వర్షించినప్పుడు నడుస్తున్నా, నిటారుగా నిల్చున్నా పిడుగు మనల్నే వాహకంగా చేసుకుంటుంది. తడిస్తే తడిచామని కింద పాదాలు మాత్రమే నేలకు తాకేలా, ఒకరికొకరు 100 అడుగుల దూరంగా కూర్చుంటే పిడుగుపాటు నుంచి తప్పించుకోవచ్చు. అలాంటి సమయంలో గడ్డపార లాంటి లోహపు వస్తువులు దగ్గర లేకుండా చూసుకోవాలి.

పిడుగుల హెచ్చరికలు ఉన్నపుడు ఆరుబయట ఉండకూడదు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో భవనాలలో, సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలి. ఉరుముల శబ్దం వినిపించిన వెంటనే పిడుగు పడే అవకాశం ఉందని గమనించాలి. అలాగని వెంటనే చెట్టు కిందకు, పొలాల్లోకి, ఆరుబయటకు వెళ్లకూడదు.

‘లైట్నింగ్‌ కండక్టర్‌’ కాపాడుతుంది
సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్, 2010లోని 74వ నియమం ప్రకారం.. ప్రతి భవన నిర్మాణంలో పిడుగుపాటు నుంచి రక్షణ ఏర్పాట్లు ఉండాలి. ఎత్తైన భవనాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, విద్యుత్‌ ఉత్పాదక ప్రాంతాలు, సరఫరా టవర్లు, పంపిణీ కేంద్రాలు, సమాచారానికి వినియోగించే టవర్లకు పిడుగు వాహకం (లైట్నింగ్‌ కండక్టర్‌) అమర్చుకోవాలి.

ఆట స్థలాలకు సమీపంలోని ఎత్తైన ప్రదేశంలో పిడుగు వాహకం అమర్చటం ద్వారా మైదానాల్లో ఆడుకునే చిన్నారులను పిడుగుల నుంచి రక్షించవచ్చు. 11 కేవీ, 33 కేవీ విద్యుత్‌ తీగల కింద, 132/220 కేవీ సరఫరా టవర్ల దగ్గర్లో నిలబడకూడదు. పెద్దపెద్ద చెట్ల కింద, సముద్రపు ఒడ్డున నిలబడొద్దు. విద్యుత్‌ వాడకం ఉన్న ప్రతిచోట ఎర్తింగ్‌ సిస్టం పాటించాలి. పిడుగుపడే సమయంలో విద్యుత్, ఎలక్ట్రానిక్‌ పరికరాలు వినియోగించడం కూడా మంచిది కాదు.
చదవండి: సోషల్ మీడియా 'కట్'.. వినోదానికే 'నెట్‌'..నివేదికలో ఆసక్తికర విషయాలు..

మరిన్ని వార్తలు