ఎక్కువ దరఖాస్తులు వాటికే..

8 Aug, 2022 03:47 IST|Sakshi

ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్ల కోసం ఒక్క నెలలోనే 1.34 లక్షల అర్జీలు

ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ కోసం 1.15 లక్షల మంది.. 

ఆ తర్వాతే ఫ్యామిలీ మెంబర్, పుట్టిన తేదీ, డెత్‌ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు

ప్రజలకు సర్టిఫికెట్లు సులభంగా జారీకి మార్గదర్శకాలు 

ప్రతి నెలా వాటి జారీ తీరుతెన్నులపై సీసీఎల్‌ఏ పర్యవేక్షణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే దరఖాస్తుల్లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్, ఇన్‌కమ్‌ సర్టిఫికెట్ల కోసమే వస్తున్నాయి. ఆ తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్, పుట్టిన తేదీ, డెత్‌ సర్టిఫికెట్ల కోసం అందుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌ వెబ్‌ అప్లికేషన్లు, కాల్‌ సెంటర్ల ద్వారా వచ్చే ఈ దరఖాస్తులకు సంబంధించిన సర్టిఫికెట్లను సులభంగా జారీచేసేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అమలుచేస్తోంది. అలాగే, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుండడంతో క్షేత్రస్థాయిలో మార్పు కనపడుతోంది. సర్టిఫికెట్ల కోసం ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి కారణాలు గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన మార్గదర్శకాలు ఇస్తున్నారు.  

దరఖాస్తుల తీరూతెన్నూ ఎలా ఉందంటే..  
► గత నెలలో 26 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ (క్యాస్ట్, నేటివిటీ, పుట్టిన తేదీ) సర్టిఫికెట్ల కోసం 1.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 92 వేల సర్టిఫికెట్లను ఆమోదించి జారీచేయగా, 1,050 సర్టిఫికెట్లను తిరస్కరించారు. 40 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే 30 శాతం సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలలుగా చూస్తే ఈ సర్టిఫికెట్ల కోసం 2.68 లక్షల దరఖాస్తులు రాగా, 2.15 లక్షల దరఖాస్తులను మంజూరు చేశారు. 8,100 దరఖాస్తులను తిరస్కరించగా, 45 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 3 నెలల్లో ఈ సర్టిఫికెట్ల పెండింగ్‌ శాతం 16 శాతంగా ఉంది.  
► అలాగే, గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ కోసం 1.15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 95 వేల దరఖాస్తులను మంజూరు చేశారు. 2,700 దరఖాస్తులను తిరస్కరించగా, 18 వేల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మూడు నెలలుగా చూసుకుంటే.. మొత్తం 2.20 లక్షల దరఖాస్తులు రాగా 1.93 లక్షల దరఖాస్తులను ఆమోదించి, 7,500 దరఖాస్తులను తిరస్కరించారు. 18 వేల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు.  
► ఫ్యామిలీ సర్టిఫికెట్‌ కోసం గత నెలలో 15,500 దరఖాస్తులు రాగా 7,500 దరఖాస్తుల్ని ఆమోదించి జారీచేశారు. 1,600 దరఖాస్తుల్ని తిరస్కరించగా, 6,500 దరఖాస్తుల్ని పెండింగ్‌లో పెట్టారు. ఈ దరఖాస్తులు 41% పెండింగ్‌లో ఉంటున్నాయి. మూడు నెలలుగా చూసుకుంటే 44 వేల దరఖాస్తులు రాగా 28 వేల దరఖాస్తుల్ని ఆమోదించి జారీచేశారు. 8,300 దరఖాస్తుల్ని తిరస్కరించగా, 7,500 దరఖాస్తుల్ని పెండింగ్‌లో ఉంచారు. 3 నెలల్లో ఈ దరఖాస్తులు 16% పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తుకు సంబంధించి గతంలో కుటుంబ పెద్ద సర్టిఫికెట్‌ పొంది ఉంటే దాని ప్రకారం అప్పటికప్పుడు వెంటనే సర్టిఫికెట్‌ జారీచేయాల్సి ఉంటుంది.

► పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ కోసం ఆలస్యంగా చేసుకున్న దరఖాస్తులు గత నెలలో 4,100 రాగా ఇందులో 570ని జారీచేశారు. 17 దరఖాస్తులను తిరస్కరించగా, 3,500కి పైగా పెండింగ్‌లో ఉంచారు. వీటి పెండింగ్‌ శాతం 86గా ఉండడం గమనార్హం.  

► డెత్‌ సర్టిఫికెట్‌ కోసం ఆలస్యంగా పెట్టుకున్న దరఖాస్తులు గత నెలలో 1,600 రాగా కేవలం 128నే ఆమోదించి జారీచేశారు. 17 దరఖాస్తులను తిరస్కరించారు. 1,400కి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 90 శాతానికి పైగా పెండింగ్‌లో ఉండడం గమనార్హం.  

► అలాగే, పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ కోసం ఆలస్యంగా వచ్చే దరఖాస్తులకు సంబంధించి పదో తరగతి సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని సీసీఎల్‌ఏ ఆదేశాలిచ్చింది. 

మరిన్ని వార్తలు