ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్లు!

31 Jan, 2022 03:02 IST|Sakshi

కొత్త జిల్లాల్లో కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కసరత్తు

గ్రామ, వార్డు సచివాలయాల తరహాలో కార్యకలాపాలన్నీ ఒకేచోట

సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్లు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రధానమైన జిల్లా కార్యాలయాలన్నింటినీ ఒకేచోట ఏర్పాటుచేయడం ద్వారా వాటిని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చినట్లవుతుందని భావిస్తోంది. దీనివల్ల భూమి అవసరం, వ్యయం కూడా చాలావరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఏర్పాటుచేసిన కొత్త జిల్లాల్లో పలుచోట్ల ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లు నిర్మించారు. ఇతర రాష్ట్రాల్లో మరికొన్నిచోట్ల ఇలాంటివే ఉన్నాయి. వాటన్నింటినీ పరిశీలించి మన రాష్ట్ర పరిస్థితులు, అవసరాలను బట్టి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్లు ఎలా ఏర్పాటుచేయాలనే దానిపై ఒక అవగాహనకు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

గ్రామ, వార్డు సచివాలయాల తరహాలో..
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో అన్ని సేవల్ని ఒకేచోట నుంచి అందిస్తున్నారు. గ్రామ పరిపాలన వ్యవస్థ అంతా అక్కడే కేంద్రీకృతమైంది. ఇదే తరహాలో కొత్త జిల్లాల్లో పరిపాలన విభాగాలాన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంతోపాటు డీఈఓ, వ్యవసాయ శాఖ జేడీ, సంక్షేమ శాఖల కార్యాలయాలు వందకు పైనే జిల్లా కేంద్రాల్లో పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రాల్లో అవన్నీ వేర్వేరుచోట్ల ఉన్నాయి.

బ్రిటీష్‌ కాలంలో ఏర్పాటైన కలెక్టరేట్లు, కలెక్టర్‌ బంగ్లాలు, ఎస్పీ కార్యాలయాలు భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. అదే తరహాలో కొత్త జిల్లాల్లో విడివిడిగా కార్యాలయాలు ఏర్పాటుచేస్తే ఎక్కువ భూమి అవసరమవుతుంది. నిర్మాణ వ్యయం కూడా భారీగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో భూమి లభ్యత చాలా తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఒకేచోట కార్యాలయాలన్నీ ఏర్పాటుచేస్తే భూమి సమస్య ఉండదు. అధికారుల క్వార్టర్లు, సమావేశపు గదులు, వాహనాల పార్కింగ్‌ అంతా ఒకేచోట ఉండాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం 13 జిల్లా కేంద్రాలు మినహాయిస్తే కొత్తగా ఏర్పాటుచేసే 13 జిల్లా కేంద్రాల్లో ఈ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటుచేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల్లో ఇందుకు అవసరమైన భూమిని గుర్తించినట్లు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన కమిటీల్లో రవాణా, ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్లకు సంబంధించి సవివర నివేదిక ఇచ్చినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు