ఒకే  పొలం.. చేతినిండా ఆదాయం

15 Jun, 2021 18:36 IST|Sakshi

లాభదాయకంగా మారిన సమీకృత వ్యవసాయం

ఒకే క్షేత్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు

అదే భూమిలో చేపలు, పశువులు, నాటుకోళ్లు, జీవాల పెంపకం

ప్రతి నెలా ఆదాయమే

సాంకేతిక సహకారం అందిస్తున్న ఉద్యాన వర్సిటీ

ఒకే భూమిలో అడుగడుగునా ఆదాయం పొందేలా సమీకృత వ్యవసాయం వైపు అన్నదాతలు అడుగులు వేస్తున్నారు. ఏడాది పొడవునా ప్రతినెలా ఆదాయం ఆర్జిస్తూ తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుంటున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాల రైతులు సమీకృత వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నారు. కొద్దిపాటి భూమిలోనే అందుబాటులో ఉన్న సహజ వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పాడి పశువులు, సన్న జీవాలు, పెరటి కోళ్లు, తేనెటీగలు, పుట్ట గొడుగులు, చేపలు పెంచుకుంటూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు.

గోదావరి జిల్లాల్లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న ఈ తరహా సాగుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుండగా.. వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ సాంకేతికంగా సహకారం అందిస్తోంది. 2016లో గిరిజన గ్రామాలైన పండుగూడెం, బండార్లగూడెంలో 4 క్షేత్రాల్లో పరిచయం చేసిన సమీకృత వ్యవసాయం ఇప్పుడు 89 క్షేత్రాలకు విస్తరించింది. 
– సాక్షి, అమరావతి

   
బహుళ ఆదాయ పంటలు: అందుబాటులో ఉన్న భూమిని (3 ఎకరాలు) 5 భాగాలుగా విభజించి సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో వరి, చిరు ధాన్యాలు, పప్పు, నూనె గింజలు సాగు చేస్తూ కుటుంబానికి ఆహార భద్రత కల్పించుకుంటున్నారు. పావు ఎకరంలో బహుళ వార్షిక పశుగ్రాసాలను, మరో పావు ఎకరంలో పప్పుజాతి పశు గ్రాసాలు సాగు చేస్తున్నారు. అర ఎకరంలో ఉద్యాన పంటలు, వాటిలో అంతర పంటలుగా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. మరో అర ఎకరంలో మూగజీవాలు, కోళ్ల పెంపకం కోసం షెడ్లు, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకోగా, మిగిలిన భూమిలో వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు.

వరి పొలం చుట్టూ తీసిన కందకంలో 1,000 నుంచి 1,500 వరకు చేపలను పెంచుతున్నారు. చెరువు చుట్టూ పండ్ల చెట్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇవి కాకుండా పాడి పశువులు, మేకలు, గొర్రెలు, పెరటి కోళ్లు, బాతులు, కముజు పిట్టలు, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంతో అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇలా 3 ఎకరాల్లో సమీకృత వ్యవసాయం ద్వారా నికరంగా రూ.3.60 లక్షల నుంచి రూ.4.20 లక్షల ఆదాయం లభిస్తోంది.
కష్టానికి తగిన ప్రతిఫలం వస్తోంది

నాకు నాలుగెకరాలు ఉంది. రెండెకరాల్లో వరి వేశాం. మరో ఎకరంలో మిర్చి సాగు చేస్తున్నాం. ఎకరంలో చేపల చెరువు వేశాం. మొదటి పంట వరి, రెండో పంట మొక్కజొన్న వేస్తాం. రెండూ ఎకరాకు 30 బస్తాల చొప్పున దిగుబడి ఇస్తున్నాయి. పాడి గేదెలు, మూడు గొర్రెలు ఇచ్చారు. వాటిద్వారా రూ.50 వేల వరకు ఆదాయం వస్తోంది. చేపల ద్వారా రూ.లక్ష ఆదాయం వచ్చింది. కోళ్ల ద్వారా ఏటా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వస్తోంది.    – మడకం వీరాస్వామి,  ఎర్రాయి గూడెం, పశ్చిమ గోదావరి

ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం
సన్న, చిన్నకారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. ముందుకొచ్చే రైతులకు కేవీకేల ద్వారా శిక్షణనిస్తున్నాం. చేపలు, పాడి గేదెలు, కోళ్లు, వాటికి మేత అందిస్తున్నాం. ఏడాది పొడవునా ఆదాయం ఆర్జిస్తున్నారు. 
– డాక్టర్‌ తోలేటి జానకిరామ్, వీసీ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ  

చదవండి: చక్కనైన ఓ చిరుగాలి

మరిన్ని వార్తలు