Andhra Pradesh: ఆరోగ్యసేవల అనుసంధానం

2 Sep, 2021 03:12 IST|Sakshi

ఈనెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ, 104, పీహెచ్‌సీలు.. 

అనంతరం వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల లింకు

రోగి సమాచారం అంతా ఒకేచోట

దేశంలోనే తొలిసారి ఈ విధానం అమలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్యశాఖలో సమగ్ర ఆరోగ్య వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ సిస్టం) రూపుదిద్దుకుంటోంది. వైద్యసేవల్ని అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రోగికి సంబంధించిన సమాచారం పక్కాగా ఒకే చోట లభిస్తుంది. తద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. తొలిదశలో ఈనెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 104 సర్వీసులను అనుసంధానం చేయనున్నారు. ఈ మూడు సర్వీసుల్లో ఎక్కడకు వెళ్లినా రోగి పూర్తి సమాచారం ఉంటుంది. 104 వాహనాల్లో రక్తనమూనాలు పరిశీలించిన వివరాలు సైతం దీన్లో నమోదు చేస్తారు.

ఉదాహరణకు 104 వాహనంలో సేవలు పొందాక ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది. అప్పుడు రోగికి ఇచ్చిన ప్రత్యేక కోడ్‌ను క్లిక్‌ చేయగానే, నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో సైతం గతంలో బీపీ ఉందా, షుగర్‌ ఉందా, ఏ తేదీల్లో చూపించుకున్నారు.. ఇలా మొత్తం సమాచారం వెల్లడవుతుంది. ప్రస్తుతం దేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.

1,149 పీహెచ్‌సీలు, 104 వాహనాలు 676
ప్రస్తుతం రాష్ట్రంలో 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 104 వాహనాలు 676 సేవలందిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిలో 800కు పైగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులున్నాయి. ఈ మూడు సర్వీసులను కలిపి రోగుల డేటాను ఒకే వేదికపై ఉంచుతారు. ఇప్పటికే క్యూ ఆర్‌ కోడ్‌తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులో గానీ, లేదా ప్రత్యేక కోడ్‌ నంబరు ఇవ్వడం ద్వారా గానీ సమాచారం తెలుసుకోవచ్చు.

వాహనంలో చికిత్సలు పొందినా, పీహెచ్‌సీలో వైద్యం పొందినా.. ఈరెండూ కాకుండా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లినా రోగి గతంలో తీసుకున్న చికిత్సల వివరాలన్నీ వస్తాయి. దీనివల్ల రోగి పూర్వాపరాలు తెలుసుకోవడంతో పాటు తక్షణమే చికిత్స చేయడానికి వీలుంటుంది. బ్లడ్‌గ్రూపు వివరాలు కూడా ఉంటాయి కాబట్టి అత్యవసర సమయాల్లో ఆలస్యం జరగకుండా ఉంటుంది. ఈ మూడు సర్వీసులను అనుసంధానించే ప్రక్రియను ఈనెలాఖరు నాటికి పూర్తి చేయాలని కుటుంబ సంక్షేమశాఖ భావిస్తోంది.

తర్వాత మిగిలినవన్నీ..
ఈ మూడు సర్వీసులు అనుసంధానం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,051 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, 195 సామాజిక ఆరోగ్య కేంద్రాలను వీటికి లింక్‌ చేస్తారు. తరువాత ఏరియా ఆస్పత్రుల వరకు అనుసంధానం చేస్తారు. దీంతో రాష్ట్రంలో ఒక పేషెంటు ఏ ఆస్పత్రికి వెళ్లినా అతడి సమస్త సమాచారం ఒక కోడ్‌ నంబరు క్లిక్‌ చేస్తే వస్తుంది. ఇలా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల రోగికి తక్షణమే వైద్యం అందించడంతో పాటు సరైన వైద్యం అందించే వెసులుబాటు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

త్వరలో ఇంటిగ్రేటెడ్‌ సేవలు
ఈనెలాఖరుకల్లా ఆరోగ్యశ్రీ, పీహెచ్‌సీలు, 104 సర్వీసుల అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. క్రమంగా మిగతా ఆస్పత్రులనూ ఒకే గొడుగు కిందకు తెస్తాం. దీనివల్ల రోగులకు ఉపయోగమే కాదు, వైద్యులకు కూడా చికిత్సలు సులభతరమవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చికిత్స అనంతరం ఇంటివద్దకే వెళ్లి మందులు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సేవలను ఉన్నతీకరిస్తున్నాం.
– కాటమనేని భాస్కర్,కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ  

మరిన్ని వార్తలు