భావి తరాలకు వరం 

11 Dec, 2021 03:48 IST|Sakshi
మూడు రాజధానులకు సంఘీభావం తెలుపుతున్న మేధావుల ఫోరం ప్రతినిధులు

విశాఖను పరిపాలన రాజధానిగా చేయాల్సిందే.. 

దూరదృష్టితో సీఎం జగన్‌ నిర్ణయం

దొండపర్తి (విశాఖ దక్షిణ): మూడు రాజధానులకు మద్దతుగా శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన చర్చా వేదికలో మేధావుల ఫోరం తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం ప్రతిని పంపనున్నట్లు తెలిపింది. పరిపాలనా వికేంద్రీకరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం భావితరాలకు వరం లాంటిదని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థిక విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ శ్రీరామమూర్తి పేర్కొన్నారు. ‘పరిపాలనా వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఆవశ్యకత–ఆంధ్రప్రదేశ్‌ సమతౌల్య అభివృద్ధి’పై విశాఖ ఏయూలోని టీఎల్‌ఎన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

గత పాలకులు అన్ని ప్రాంతాల అభివృద్ధిని విస్మరించడం రాష్ట్రానికి శాపంగా పరిణమించిందని, రూ.లక్ష కోట్లతో ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం అవివేకమన్నారు. నీటి వనరులు, వ్యవసాయ భూములు పుష్కలంగా ఉన్న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలను నాశనం చేస్తూ గత సర్కారు తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్‌ దూరదృష్టితో తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అభినందనీయమన్నారు.  

ఉద్యమించక ముందే మద్దతివ్వండి.. 
విభజనతో ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఆంధ్రప్రదేశ్‌కు మిగిలాయని ప్రొఫెసర్‌ ఎన్‌ఏడీ పాల్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి, భవిష్యత్‌ తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలన్న సంకల్పంతో సీఎం జగన్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఏయూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ విజయ్‌మోహన్‌ తెలిపారు. పటిష్ట నాయకత్వం, పాలకులకు దూరదృష్టి లేకపోవడం వల్ల ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతూ వస్తోందని న్యాయ కళాశాల ప్రొఫెసర్‌ సూర్యప్రకాష్‌ చెప్పారు. అమరావతి ప్రాంతం హైదరాబాద్‌లా అభివృద్ధి చెందాలంటే వందేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు.

విద్యార్థులు, యువత ఉద్యమబాట పట్టకముందే ప్రతిపక్షాలు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని ప్రొఫెసర్‌ షరాన్‌ రాజ్‌ డిమాండ్‌ చేశారు. మరోసారి ప్రాంతీయ విద్వేషాలు తలెత్తకుండా ఉండాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏయూ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెసర్‌ రవి పేర్కొన్నారు. ఎయిడెడ్‌ కళాశాలల తరఫున ప్రొఫెసర్‌ మధుసూదనరావు మాట్లాడుతూ తాము గుంటూరు నుంచి వచ్చినప్పటికీ పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని గట్టిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.  సమావేశంలో నాన్‌ టీచింగ్‌ యూనియన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రవికుమార్, ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు షేక్‌ ఖాదర్‌ బాబా తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు