‘అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా’గానే కొనసాగించాలి 

29 May, 2022 05:53 IST|Sakshi

మేధావులు, ప్రొఫెసర్లు, వివిధ సంఘాల నాయకులు  

ఏయూ క్యాంపస్‌: కోనసీమకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులు, మేధావులు కోరారు. విదేశాల్లో సైతం అంబేడ్కర్‌ విగ్రహాలు, సెంటర్లు పెడుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం అడ్డుకోవడం దారుణమన్నారు. శనివారం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన మేధావుల చర్చాగోష్టిలో ప్రొఫెసర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మాజీ ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ భావజాలాన్ని అర్థం చేసుకున్నవారు ఇలా విధ్వంసాలకు పాల్పడరన్నారు. సీఎం జగన్‌ దావోస్‌ పర్యటిస్తూ.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్న సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం విచారకరమన్నారు. మహిళా విద్య కోసం అంబేడ్కర్‌ ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఏయూ లా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ డి.సూర్యప్రకాశరావు మాట్లాడుతూ.. కొలంబియా యూనివర్సిటీలో సైతం అంబేడ్కర్‌ కార్నర్‌ ఉందన్నారు.

అంబేడ్కర్‌ను గౌరవించడమంటే.. మనల్ని మనం గౌరవించుకోవడమేనన్నారు. ఉత్తరాంధ్ర కాపు సంఘం అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌ఠాగూర్‌ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సును ఆకాంక్షించే అంబేడ్కర్‌ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం స్వాగతించాల్సిన అంశమన్నారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు ఆచార్య జేమ్స్‌ స్టీఫెన్, ఆచార్యులు డి.వి.ఆర్‌ మూర్తి, కె.పల్లవి, కె.విశ్వేశ్వరరావు, చల్లా రామకృష్ణ, ఎన్‌.విజయమోహన్, డాక్టర్‌ జి.రవికుమార్, రెక్టార్‌ కె.సమత, ప్రిన్సిపాల్స్‌ పి.రాజేంద్ర కర్మార్కర్, టి.శోభశ్రీ, డీన్‌లు ఆచార్య ఎన్‌.సత్యనారాయణ, టి.షారోన్‌ రాజు, పాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు