AP: ఎండ 'మండింది'

10 Mar, 2022 03:33 IST|Sakshi

రాష్ట్రంలో వేసవి ప్రారంభంలోనే మంటెక్కిస్తున్న ఎండలు

ఉదయపు ఉష్ణోగ్రతలు పెరగడమే కారణం

ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య గతంకంటే ఎక్కువ వేడి

ఆ సమయంలోనే 34, 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు

11 నుంచి 3 గంటల మధ్య 38, 39 డిగ్రీలు

సాక్షి, అమరావతి: వేసవి ప్రారంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగింది. ప్రస్తుతం 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత సంవత్సరం పలుచోట్ల ఇదే సమయానికి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నా  ఎండ వేడి మాత్రం గతంకంటె తీవ్రంగా ఉంది. ఉదయపు ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. గతంలో ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండేవి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి.

ఇప్పుడు ఉదయపు ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 2, 3 డిగ్రీల వరకు పెరుగుతున్నాయి. దీంతో రోజులో ఎండ వేడి ఎక్కువవుతోంది. మరోవైపు గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల కూడా ఎండ వేడిమి పెరగడానికి కారణమవుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్, గ్రీన్‌ హౌస్‌ ప్రభావంతో భూమి త్వరగా వేడెక్కుతోంది. ఫలితంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనా ఎక్కువ గంటలు ఎండలు కొనసాగుతున్నాయి.

ఈ సంవత్సరం ఎండలు ఎక్కువే
ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలలో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత 45.9 డిగ్రీలు. ఈ సంవత్సరం 1, 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగి 47 దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. బుధవారం కర్నూలు జిల్లా అవుకులో 39.3 డిగ్రీలు, నందవరంలో 39.2, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో 39.1, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 39, గుంటూరులో 38, విజయవాడలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

మరిన్ని వార్తలు