మూడు రోజులు మంటలే..

24 Mar, 2021 04:24 IST|Sakshi

 సాధారణం కంటే 3 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలు: వాతావరణ శాఖ హెచ్చరిక  

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వచ్చే మూడు రోజులూ భానుడు సెగలు కక్కనున్నాడు. నడి వేసవిని తలపించేలా ఎండలు మండుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర భారతదేశం నుంచి తేమగాలులు, బంగాళాఖాతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయని, దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అధికపీడనం కారణంగా ఎండలు పెరిగే వీలుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. మంగళవారం కర్నూలు, తునిలో 39.5, విశాఖ, కడప, జంగమహేశ్వరపురంలో 38.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా,ఈ నెలాఖరులో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

మరిన్ని వార్తలు