ఏపీలో సెప్టెంబర్‌ 15 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ

4 Aug, 2021 03:17 IST|Sakshi

షెడ్యూల్‌ విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు–2021 సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ విద్యామండలి మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకండియర్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

మార్చిలో జరగాల్సిన పబ్లిక్‌ పరీక్షలు–2021 కోవిడ్‌ కారణంగా వాయిదా పడుతూ చివరకు రద్దయిన సంగతి తెలిసిందే. ఉన్నత చదువులకు వీలుగా హైపవర్‌ కమిటీ సిఫార్సులను అనుసరించి ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు ఇటీవల ఇంటర్‌ బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఆ విద్యార్థుల టెన్త్, ఇంటర్‌ ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. ఫస్టియర్‌ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు పేర్కొంది.

సెకండియర్‌ ఫలితాల్లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చు. ఫస్టియర్‌ విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్షలు రాయవలసి ఉంటుంది. పరీక్ష ఫీజును ఆగస్టు 17లోపు చెల్లించాలి. జనరల్, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులంతా ఈ గడువులోగా ఫీజులు చెల్లించాలి. పబ్లిక్‌ పరీక్షలకు ఇంతకు ముందు ఫీజు చెల్లించిన ఫస్టియర్‌ విద్యార్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

బెటర్‌మెంట్‌ కోసం ఈ పరీక్షలకు హాజరవుదామనుకునే సెకండియర్‌ విద్యార్థులు కూడా ఫీజు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఇంతకు ముందు వచ్చిన మార్కులు, ఇప్పుడు వచ్చిన మార్కుల్లో ఏవి ఎక్కువగా ఉంటే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. అటెండెన్స్‌ మినహాయింపుతో ప్రైవేటుగా పరీక్షలకు హాజరయ్యే హ్యుమానిటీస్‌ అభ్యర్థులు మాత్రం ఫీజు చెల్లించాలి. 2019లో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు బెటర్‌మెంట్‌ మార్కుల కోసం ఈ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలే చివరి అవకాశం. పరీక్షల తేదీలను పొడిగించబోమని బోర్డు కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. 

మరిన్ని వార్తలు