సెకండ్‌ ఇంటర్‌ పరీక్షలే ముందు.. 

26 Jan, 2021 06:03 IST|Sakshi

ఆ తర్వాతే ఫస్టియర్‌ పరీక్షలు

మొదటి సంవత్సరం అడ్మిషన్లు ఆలస్యం కావడమే కారణం

గతంలో ఒక్కరోజు తేడాతో రెండేళ్ల పరీక్షలు ఒకేసారి ప్రారంభం

ఈసారి కోవిడ్‌ కారణంగా వేర్వేరుగా నిర్వహించే అవకాశం

సెకండియర్‌ పరీక్షల ఫీజు గడువు ఫిబ్రవరి 11

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్‌–2021 మార్చి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియెట్‌ విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఈసారి ఫస్టియర్, సెకండియర్‌ పరీక్షలను ఒకే షెడ్యూల్‌లో కాకుండా వేర్వేరుగా నిర్వహించే అవకాశాలున్నాయి. కరోనా కారణంగా 2020–21 విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారడమే దీనికి కారణం. నిజానికి ప్రస్తుత విద్యా సంవత్సరం తరగతులు జూన్‌లో ప్రారంభం కావల్సి ఉండగా కరోనా కారణంగా నవంబర్‌ 2 నుంచి కేవలం సెకండియర్‌ తరగతులు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఫస్టియర్‌ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో నిర్వహించాలనుకున్నప్పటికీ కోర్టు తీర్పుతో నిలిచిపోయాయి. ఆ తర్వాత ఈనెల 18 నుంచి ఫస్టియర్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం రెండో విడత ప్రవేశాలు సోమవారం వరకు కొనసాగాయి. ఈ నేపథ్యంలో.. ఫస్టియర్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో ముందుగా సెకండియర్‌ పరీక్షలను పూర్తిచేసేందుకు బోర్డు కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం సెకండియర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. ఫస్టియర్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు.

ఫిబ్రవరి 11లోగా పరీక్షల ఫీజు చెల్లించాలి
ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు పరీక్ష ఫీజును వచ్చేనెల ఫిబ్రవరి 11లోగా చెల్లించాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్‌ విద్యార్థులు, గతంలో ఫెయిలైన విద్యార్థులు (జనరల్, వొకేషనల్‌), కాలేజీలో స్టడీ లేకుండా హాజరు మినహాయింపు పొందిన (హ్యుమానిటీస్‌) విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ముందుగా సెకండియర్‌ పరీక్షల ఫీజు గడువును ప్రకటించడం ద్వారా పరీక్షకు ఎంతమంది విద్యార్థులు ఉంటారన్న దానిపై ఒక స్పష్టత వస్తుందని, తదనంతరం పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లుచేస్తామని బోర్డు వర్గాలు ప్రకటించాయి. కోవిడ్‌ నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షల నిర్వహణను చేపట్టాల్సి ఉంటుందన్నారు. 

ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం
ప్రస్తుతం సెకండియర్‌ చదివే విద్యార్థులు తమ ఫస్టియర్‌ సబ్జెక్టుల మార్కుల్లో పెరుగుదల కావాలనుకుంటే అలాంటి వారికి ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడాది అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. కానీ, ఫస్టియర్‌లో అన్ని సబ్జెక్టులలో పాసైన వారు మాత్రమే ఈ ఇంప్రూవ్‌మెంటుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫస్టియర్‌ పరీక్ష ఫీజు రూ.490తో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున ఇంప్రూవ్‌మెంటు పరీక్షకు చెల్లించాల్సి ఉంటుంది. కాలేజీ స్టడీ లేకుండా హాజరు మినహాయింపుతో 2021 మార్చి ఫస్టియర్, సెకండియర్‌ ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రెగ్యులర్‌ విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్‌లోనే పరీక్షలను రాయవలసి ఉంటుంది. అలాగే, విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజులను చెల్లించాలనుకుంటే  ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని బోర్డు ప్రకటించింది. ఫీజుల చెల్లింపు తేదీని పొడిగించేదిలేదని స్పష్టం చేసింది.

సీఎం ఆదేశాలతో పరీక్ష ఫీజుల పెంపు నిలుపుదల
ఈ ఏడాది నుంచి ఇంటర్‌ పరీక్షల ఫీజును పెంచాలని బోర్డు ఇప్పటికే నిర్ణయించింది. అయితే, కోవిడ్‌–19ను దృష్టిలో పెట్టుకుని ఫీజులు పెంచవద్దని.. దానితో పాటు ఆలస్య రుసుమును కూడా రద్దుచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని.. దీంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇక పరీక్ష ఫీజులకు సంబంధించిన వివిధ కేటగిరీల వారీ వివరాలను బోర్డు ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’లో 
పొందుపరిచింది.  

మరిన్ని వార్తలు