Andhra Pradesh: ఏప్రిల్‌ 22 నుంచి ఇంటర్‌ పరీక్షలు

4 Mar, 2022 04:21 IST|Sakshi

జేఈఈ మెయిన్‌ తేదీల ప్రకటనతో ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసిన బోర్డు 

కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు 

మే 12తో ముగియనున్న పరీక్షలు.. జూన్‌లో ఫలితాలు 

టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ యథాతథం 

జూన్‌ లేదా జూలైలో ఏపీఈఏపీ సెట్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలను ఇంటర్మీడియెట్‌ బోర్డు వాయిదా వేసింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 22 నుంచి ప్రారంభమై మే 12తో ముగుస్తాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం సచివాలయంలో మారిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, జేఈఈ మెయిన్‌–2022 మొదటి విడత పరీక్షలను ఏప్రిల్‌ 16–21 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఇంటర్‌ పరీక్షల మధ్యలో జేఈఈ పరీక్షల షెడ్యూల్‌ ఉండడంతో విద్యార్థులకు నష్టం కలిగేలా పరిస్థితులు మారాయి. దీనిపై ఇంటర్మీడియెట్‌ బోర్డు బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించి పరీక్షల షెడ్యూల్‌పై చర్చించింది.

చివరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలు ముగిసిన అనంతరం ఇంటర్‌ పరీక్షలను నిర్వహించాలని బోర్డు నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీన్ని ఆమోదించిన అనంతరం గురువారం మంత్రి కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆదివారాలు, సెలవు రోజులతో పాటు మధ్యలో రంజాన్‌ పర్వదినం ఉండడంతో మే 3, 4 తేదీల్లో పరీక్షలు లేకుండా కొత్త షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ ప్రకారం ఏప్రిల్‌ 22న ప్రారంభమై మే 12తో ఇంటర్‌ పరీక్షలను పూర్తిచేస్తామని మంత్రి సురేష్‌ వెల్లడించారు. నైతిక విలువలు, పర్యావరణ విద్య సబ్జెక్టుల పరీక్షలు ఇంతకుముందు ప్రకటించిన విధంగానే మార్చి 7, 9 తేదీల్లోనే జరుగుతాయన్నారు. అలాగే, ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 11 నుంచి 31వరకు యథాతథంగా కొనసాగుతాయన్నారు. ఇక బెటర్‌మెంటు కోసం 2,500 మంది అభ్యర్థులు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రాయనున్నారని, అందుకే సెకండియర్‌ పరీక్షలతో పాటు ఫస్టియర్‌ పరీక్షలను కూడా ఇదే షెడ్యూల్‌తోపాటు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. 

ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్‌ విధానం 
ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను ఫిజిక్సు, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ఈనెల 11 నుంచి 31 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నామని, ఇందుకు జంబ్లింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నామని సమావేశంలో పాల్గొన్న ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు వివరించారు. ఇంటర్‌ థియరీ పరీక్షలకు పది లక్షల మంది వరకు విద్యార్థులు హాజరుకానున్నారని.. ఇందుకోసం 1,456 కేంద్రాలను, ప్రాక్టికల్‌ పరీక్షల కోసం 975 కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. అవసరమైన పక్షంలో పరీక్షా కేంద్రాలను పెంచుతామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.  

టెన్త్‌ పరీక్షలు యథాతథం 
టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నారు. వీటి తేదీల్లో ఎలాంటి మార్పులేదని మంత్రి వివరించారు. ఇంటర్‌ పరీక్షల మూల్యాంకనం నెలరోజుల్లో పూర్తిచేయించి ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అలాగే, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్‌ను జూన్‌ లేదా జూలైలో నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు వివరించారు. ఇక కొత్తగా ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీల అనుమతులకు సంబంధించి ఇప్పటికే సర్వే చేయించామని, అవసరమైన మేరకు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. స్కూళ్ల మ్యాపింగ్‌కు సంబంధించి మూడు కిలోమీటర్ల పైబడి ఉన్న వాటి విషయంలో అభ్యర్థనలు వస్తున్నందున పరిశీలిస్తామన్నారు. ఉర్దూ సహా ఇతర మైనర్‌ మీడియం పాఠశాలలు యథాతథంగానే కొనసాగుతాయని, వాటికి మ్యాపింగ్‌ ఉండబోదన్నారు.  

మరిన్ని వార్తలు