ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ తొలగింపు

28 Jul, 2021 04:13 IST|Sakshi

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా, తదితర కోర్సుల్లో పూర్తిగా ఈఏపీసెట్‌ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు

కరోనా నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకపోవడంతో ఈ ఏడాది వరకు వర్తింపు

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన

గతేడాది వరకు ఏపీ ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25% వెయిటేజీ

సాక్షి, అమరావతి/బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)లో ఇంటర్మీడియెట్‌ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్‌లో ఇంటర్‌ గ్రూపు సబ్జెక్టుల మార్కులకు 25% వెయిటేజీ ఇస్తూ విద్యార్థులకు ర్యాంకులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంసెట్‌ మార్కులకు 75%, ఇంటర్‌ మార్కులకు 25% వెయిటేజీతో మార్కులను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చేవారు. కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకపోవడంతో వెయిటేజీకి స్వస్తి పలికారు. టెన్త్, ఇతర తరగతుల అంతర్గత మార్కుల ఆధారంగా ఇంటర్‌ బోర్డు మార్కులు కేటాయించింది. పరీక్షలు జరగకుండా ఇచ్చిన ఈ మార్కులు విద్యార్థుల వాస్తవ ప్రతిభను ప్రతిబింబించకపోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్, తదితర కోర్సుల్లో ప్రవేశాల్లో ఈ ఏడాది వరకు ఇంటర్‌ మార్కులకు ఇచ్చే వెయిటేజీని తొలగించాలని నిర్ణయించామన్నారు. ప్రవేశ పరీక్ష మార్కులకే 100% వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిందన్నారు.

ఏపీ ఎంసెట్‌ పేరు ఏపీ ఈఏపీసెట్‌గా మార్పు
ఇప్పటివరకు ఇంజనీరింగ్, తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఏపీ ఎంసెట్‌ను నిర్వహిస్తోంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో ఆ కోర్సులను తొలగించారు. ఏపీ ఎంసెట్‌ పేరును ఏపీ ఈఏపీసెట్‌గా మార్చారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశాలకే ఈ పరీక్ష జరుగుతుంది.

ఆ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు..
కరోనాతో ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ పరీక్షలు రద్దవడంతో ఏపీ ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలు చేపడతాం. సెట్‌లో వచ్చిన మార్కులకు అడ్మిషన్లలో 100 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 19 నుంచి 25 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తాం.
– రామలింగరాజు, ఏపీ ఈఏపీసెట్‌ చైర్మన్‌    

మరిన్ని వార్తలు