మగువలే చక్కబెడుతున్నారు..

18 Oct, 2020 05:15 IST|Sakshi

రాష్ట్రంలో 81.7% మంది మహిళలు ఇంటి పనికే అంకితం 

ఇంటిపని చేస్తున్న పురుషులు 18.3 శాతమే 

జాతీయ గణాంకాల సంస్థ తాజా సర్వేలో ఆసక్తికర అంశాలు 

సాక్షి, అమరావతి: భారతీయుల జీవనశైలిపై వారు నివసిస్తున్న ప్రాంతాలు, ఆదాయం, కులాలు గణనీయ ప్రభావాన్ని చూపిస్తున్నాయని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌వో) తాజాగా విడుదల చేసిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఉద్యోగం, ఇంటి పని విషయంలో పూర్తి స్థాయిలో లింగ వివక్ష కనిపిస్తోందని సర్వే స్పష్టం చేసింది. దేశంలో రూపాయి ఆదాయం ఆశించకుండా 84 శాతం మంది మహిళలు రోజంతా ఇంటి పనికే పరిమితమవుతున్నారని తేలింది. కేవలం 16 శాతం మంది పురుషులు మాత్రమే ఆదాయం ఇవ్వని ఇంటి పనుల్లో భాగస్వాములవుతున్నారని స్పష్టమైంది. జాతీయ సగటుతో పోలిస్తే మన రాష్ట్రంలో ఇంటి పనిచేస్తున్న పురుషుల శాతం కొద్దిగా ఎక్కువగా ఉండటం విశేషం. మన రాష్ట్రంలో ఆదాయం ఇవ్వని ఇంటి పనుల్లో 81.7 శాతం మంది మహిళలు, 18.3 శాతం మంది పురుషులు పాలుపంచుకుంటున్నారు. తొలిసారిగా దేశవ్యాప్తంగా ప్రజలు తమ సమయాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారన్న అంశంపై గతేడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 4,50,000 మందిపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.  

ఇంటి పనుల్లో పురుషులు కొద్దిమందే.. 
► 6% మంది పురుషులు వంటింటిలో గరిట తిప్పుతుండగా, 8% మంది మాత్రమే ఇంటి గదులను శుభ్రపరుస్తున్నారు. 
► పేదరికంలో ఉన్నవారు సంపాదన కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తుంటే ధనవంతులు నిద్రపోవడానికి వినియోగిస్తున్నారు. 
► ఉన్నత కులాల వాళ్లు ఖాళీ సమయాన్ని స్వీయ సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. అలాగే మతపరమైన కార్యక్రమాలు, టీవీ, మీడియా వంటివాటికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. 
► ఎస్సీ, ఎస్టీలు ఖాళీ సమయాన్ని సామాజిక బృందాలను ఏర్పాటు చేసుకోవడానికి వినియోగిస్తున్నారు. ఉన్నత కులాలకు చెందిన పురుషులు సంపాదన లేని పనులు చేయడానికి తక్కువ ఆసక్తి చూపుతున్నారు. 
► వెనుకబడిన కులాల్లో 40 శాతం మంది ప్రధాన ఆదాయ వనరు.. కూలి పనులే.

మన రాష్ట్రానికి సంబంధించిన సర్వే వివరాలిలా.. 
► ఆదాయ సంపాదన వంటి కార్యక్రమాల్లో 61 శాతం మంది పురుషులు, 28.9 శాతం మంది మహిళలు ఉన్నారు. 
► లాభాపేక్ష లేకుండా ఇంటి సభ్యుల సంరక్షణ పనులు చేయడానికి 10.8 శాతం మంది పురుషులు, 24 శాతం మంది మహిళలు ఆసక్తి చూపారు. 
► స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనడానికి 2.6 శాతం మంది పురుషులు, 1.8 శాతం మంది మహిళలు ముందుకొచ్చారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి 20.3 శాతం మంది పురుషులు, 16 శాతం మంది మహిళలు ఆసక్తి చూపారు. సామాజిక, సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో 92.2 శాతం మంది పాల్గొంటున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు