మార్చి 15 నుంచి ఇంటర్‌ పరీక్షలు

27 Dec, 2022 05:57 IST|Sakshi

15 నుంచి ఫస్ట్‌ ఇయర్, 16 నుంచి సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభం

ఏప్రిల్‌ 4తో ముగియనున్న పరీక్షలు

ఏప్రిల్‌ 15 నుంచి ప్రాక్టికల్స్‌

జేఈఈ మెయిన్‌తో ఇబ్బంది లేకుండా ప్రాక్టికల్స్‌ మార్పు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌–2023 పబ్లిక్‌ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి.

నైతికత, మానవ విలువలు పరీక్షను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, పర్యావరణ విద్య పరీక్షను ఫిబ్రవ­రి 24న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభమవుతాయి.

వీటిని ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకు, ఏప్రిల్‌ 30, మే 10వ తేదీలలో రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఆదివారాలతో కలుపుకొని ఆయా రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వర­కు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయి. జనరల్, వొకేషనల్‌ గ్రూపుల విద్యార్థులందరికీ ఇదే షెడ్యూల్‌లో ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. 

ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్‌ విధానం: ప్రాక్టికల్‌ పరీక్షలను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. దీనిలో జంబ్లింగ్‌ విధానాన్ని అనుసరిస్తారు. 

జేఈఈ మెయిన్‌ పరీక్షల కారణంగా ఏప్రిల్‌లో ప్రాక్టికల్స్‌ 
ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు సాధారణంగా జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి నెలాఖరులోపు పూర్తి చేసేవారు. ఈ ఏడాది జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను ఏప్రిల్‌ రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు.

జేఈఈ మెయిన్‌ తొలి సెషన్‌ పరీక్షలు జనవరి 24 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ షెడ్యూల్‌ ప్రకటించింది. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలను రిజర్వుగా కేటాయించింది. రెండో సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు నిర్వహించడంతోపాటు 13, 15 తేదీలను రిజర్వులో ఉంచింది. జేఈఈ మెయిన్‌ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఇంటర్మీడియెట్‌బోర్డు ఈసారి ప్రాక్టికల్, ఇతర పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించింది.  

మరిన్ని వార్తలు