5 నుంచి ఇంటర్‌ పరీక్షలు: కలెక్టర్‌ ఇంతియాజ్‌

28 Apr, 2021 10:13 IST|Sakshi

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఇంటర్మీడియెట్‌ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ అన్నారు. మంగళవారం నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ మే 2021 నిర్వహణపై కలెక్టర్‌ అధ్యక్షతన కోఆర్డినేషన్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియెట్‌ పరీక్షలు నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి జిల్లాలో మొత్తం 142 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో విజయవాడ నగర పరిధిలో 77 కేంద్రాలను ఏర్పాటు చేయగా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 65 సెంటర్లను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు.

జిల్లాలో 1,12,154 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ పరీక్షలు రాయనున్నారని,  వారిలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 54,171 మందికాగా రెండవ సంవత్సరం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 57,983 మంది ఉన్నారని కలెక్టరు అన్నారు. పరీక్షలు పకడ్బందీ నిర్వహణకు, ఎటువంటి మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకు న్నామని, దీనిలో భాగంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 104 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, 4 ఫయింగ్‌ స్క్వాడ్‌లను నియమించామని, 8 సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, కోవిడ్‌ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద కోవిడ్‌ ప్రొటోకాల్‌ ఆఫీసర్‌ను నియమించామని, ఐసోలేషన్‌ గదిని కూడా ఏర్పాటు చేశామని కలెక్టర్‌ వెల్లడించారు.

పరీక్షా కేంద్రాలను కలుపుతూ ఆర్టీసీ బస్సులను నడిపేందుకు రూట్‌ వివరాలను ఆర్టీసీ అధికారులకు అందించామని, పరీక్షలు జరిగే తేదీల్లో ఉదయం 6.30 గంటల నుంచి విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కలెక్టరు ఆదేశించారు.  పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, విజయవాడ నగరపాలక సంస్థ అడిషినల్‌ కమిషనరు మోహనరావు, డిస్ట్రిక్ట్‌ ఎగ్జామినేషన్స్‌ కమిటీ కన్వీనర్‌ ఆర్‌ఐఓ పి.రవికుమార్, డిస్ట్రిక్ట్‌ ఎగ్జామినేషన్‌ కమిటీ మెంబర్లు కె.యోహాన్, షేక్‌ అహ్మద్, బి.వి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ మొదటి సెమిస్టర్‌ షెడ్యూల్‌
మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ కేబీ చంద్రశేఖర్‌ ఆమోదంతో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ డి.రామశేఖరరెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పరీక్ష ఫీజు, పరీక్షల టైంటేబుల్‌ను వర్సిటీ వెబ్‌సైట్‌ నందు పొందుపరిచామన్నారు. విద్యార్థులు పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కల్పించామన్నారు. తొలిసారిగా ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్ష ఫీజు, ఫలితాల ప్రక్రియ నిర్వహణ జరుగుతుందని తెలిపారు.

చదవండి: కోవిన్‌ పోర్టల్‌: టీకా వేయించుకునేందుకు ఏం చేయాలి?

మరిన్ని వార్తలు