టీడీపీలో వర్గవిభేదాలు: ఆయనకు టిక్కెట్టు ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడు అంటూ..

28 Mar, 2022 10:04 IST|Sakshi

అనంతపురం (ఓడీ చెరువు): టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరస్పర వ్యాఖ్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఓడీచెరువు మండలం కొండకమర్లలోని మాజీ ఎంపీపీ ఇస్మాయిల్‌ గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేత సాకెం శ్రీనివాసరెడ్డితో కలసి వచ్చారు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో జేసీ మాట్లాడుతూ జిల్లాలో టీడీపీకి చెందిన 11 మంది మాజీ ఎమ్మెల్యేలు మరకలున్న నాయకులేనని, వారందరినీ చంద్రబాబు మార్చాలని అన్నారు.

పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథరెడ్డికి టిక్కెట్టు ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ మరకాలేని సాకెం శ్రీనివాసరెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉంటాడని, అతన్ని బలపర్చుతున్నట్లు చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి  ఘాటుగా స్పందించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తిలో టీడీపీని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  ‘టిక్కెట్టు ఇచ్చేది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. తాడిపత్రిలో నీకు టిక్కెట్టు వస్తుందో, లేదో చూసుకో. ఇతర నియోజకవర్గాల్లోకి జోక్యం చేసుకుంటే పార్టీకి ప్రమాదం. నేను ఇప్పటికి ఆరు సార్లు బీ ఫారం తీసుకున్నా. ఏడోసారి కూడా తీసుకుంటా’నని అన్నారు.  

మరిన్ని వార్తలు