విశాఖలో అంతర్జాతీయ యానిమేషన్‌ చిత్ర నిర్మాణం

21 Jun, 2022 08:32 IST|Sakshi

రూ.45 కోట్ల వ్యయం

విశాఖ (ఏయూ క్యాంపస్‌): అంతర్జాతీయ యానిమేషన్‌ చిత్రం ‘నోహాన్‌ ఆర్క్‌’ విశాఖ కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. విశాఖ ఐటీ పార్కులోని సింబయాసిస్‌ టెక్నాలజీస్‌ సంస్థలో అమెరికా, బ్రెజిల్‌ దేశాలకు చెందిన నిర్మాతలు దీనిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.45 కోట్లను వెచ్చిస్తున్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో యానిమేషన్‌ ఫిల్మ్‌గా దీనిని  రూపొందిస్తున్నట్టు సింబయాసిస్‌ టెక్నాలజీస్‌ సీఈవో ఓ.నరేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్ర నిర్మాణంలో భాగంగా సముద్రంలో తుపానులను సృష్టించే వీఎఫ్‌ఎస్‌ల కోసం ప్రత్యేక కంప్యూటర్లను వినియోగిస్తామన్నారు.

ఇటువంటి అంతర్జాతీయ చిత్రాలు మరిన్ని నిర్మించడానికి వీలుగా వీఎఫ్‌ఎక్స్, లైవ్‌ల్యాబ్, డబ్బింగ్‌ స్టూడియో, ఫిల్మ్‌ ల్యాబ్‌లను సిద్ధం చేశామన్నారు. షార్ట్‌ ఫిల్మ్‌లు, యాడ్‌ ఫిల్మ్‌లు చిత్రీకరించి, ఎడిటింగ్, డబ్బింగ్‌ చేసే విధంగా అత్యున్నత సదుపాయాలను తమ సంస్థలో నెలకొల్పడం జరిగిందన్నారు. అంతర్జాతీయ యానిమేషన్‌ చిత్రాల రూపకల్పనలో విశాఖకు మంచి గుర్తింపు లభించినట్టుగా తాము భావిస్తున్నామన్నారు. చిత్ర నిర్మాణం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ఐటీ శాక మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు సోమవారం సాయంత్రం నరేష్‌కుమార్‌ వివరించగా.. ఆయన హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు