విశ్వనగరి విశాఖ.. 2023లో వైజాగ్‌లో జరిగే ప్రధాన ఈవెంట్స్‌ ఇవే!

23 Dec, 2022 10:37 IST|Sakshi

కార్యనిర్వాహక రాజధాని విశాఖకు అంతర్జాతీయ బ్రాండింగ్‌

వరుస అంతర్జాతీయ సదస్సులతో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీగా విశాఖ

విశాఖ వేదికగా వచ్చే 4 నెలల్లో అంతర్జాతీయ సదస్సులు

హోటల్‌ గదులను అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకుంటున్న పారిశ్రామికవేత్తలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌)గా విశాఖపట్నా­న్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంతర్జాతీయంగా బ్రాండింగ్‌ కల్పించేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. వరుస అంతర్జాతీయ కార్య­క్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలోనే అత్యధిక కార్యక్రమాలు జరుగుతున్న (మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీ) నగరంగా విశాఖ పేరు మారుమోగేలా చర్యలు చేపట్టింది.

వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్య కాలంలో జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు విశాఖను వేదిక చేయనుండటమే దీనికి నిదర్శనం. ప్రపంచంలోనే ఆర్థికంగా మొదటి 20 స్థానాల్లో ఉన్న దేశాల(జీ–20)కు ఈ ఏడాది భారత్‌ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడంతో విశాఖ వేదికగా మూడు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. 

వరుస సదస్సులు.. వేడుకలతో..
ఫిబ్రవరి 3, 4 తేదీలతో పాటు ఏప్రిల్‌ 24న విశాఖ కేంద్రంగా ఆర్థిక, వ్యవసాయ, పర్యావరణ, విద్య, వైద్యం వంటి అంశాలపై నిర్వహించే సదస్సులకు పలు దేశాల నుంచి వందలాది మంది ప్రతినిధులు విశాఖ రానున్నారు. విశాఖ బ్రాండ్‌ ఉట్టిపడేలా వారికి అతిథి మర్యాదలు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌) 2023 పేరుతో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిని విజయవంతం చేసేవిధంగా ప్రత్యేక లోగోను రూపొందించి పలు దేశాల్లో రోడ్‌ షోలను నిర్వహించబోతోంది.

హై ఎండ్‌ టెక్నాలజీకి విశాఖను వేదికగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా జనవరి 20, 21 తేదీల్లో ఇన్ఫినిటీ వైజాగ్‌ పేరుతోను, ఫిబ్రవరి 16,17 తేదీల్లో గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ రెండు కార్యక్రమాలకు వివిధ బహుళజాతి ఐటీ కంపెనీల ప్రతినిధులు విశాఖకు తరలిరానున్నారు. ఈ సందర్భంగా విశాఖలో ఐటీ రంగానికి ఉన్న మౌలిక వసతులు, బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌తో ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు వంటి వాటిని ప్రత్యక్షంగా వారికి వివరించనున్నారు.

అలాగే ప్రవాసాంధ్ర వైద్యులు రాష్ట్రంలోని వైద్య రంగంలో గల అవకాశాలపై జనవరి 6 నుంచి 8 వరకు మూడు రోజులు పాటు విశాఖ వేదికగా సదస్సులు నిర్వహించనున్నారు. వీటితోపాటు పర్యాటకం, మారిటైమ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి రంగాల్లో కూడా విశాఖ వేదికగా సదస్సులు నిర్వహించడానికి ఆయా విభాగాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత విశాఖ ప్రగతిని మార్చే భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన జరగనుంది. ఇలా వరుస సదస్సులు, వేడుకులతో విశాఖ నగరం దేశంలో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీగా నిలుస్తోంది.

స్టార్‌ హోటల్స్‌ ఫుల్‌
వరుసగా అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులు విశాఖలో జరగనుండటంతో ఈ కార్యక్రమాలకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు ముందస్తుగా స్టార్‌ హోటల్స్‌ గదులను బుక్‌ చేసుకుంటున్నారు. విశాఖలో ఫైవ్‌ స్టార్, ఫోర్‌ స్టార్‌ హోటల్స్‌ అన్నిటిలో 700కు పైగా గదులు ఉండగా.. వచ్చే ఏడాది ఈవెంట్స్‌ రోజులకు సంబంధించి అప్పుడే చాలా గదులను బుక్‌ అయినట్లు హోటల్స్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

సాధారణ రోజుల్లో స్టార్‌ హోటల్స్‌లో ఆక్యుపెన్సీ రేషియో 60 నుంచి 70 శాతంగా ఉంటుండగా, వచ్చే ఏడాది ఈ సమావేశాల తేదీల్లో అప్పుడే పలు హోటల్స్‌లో గదులు 100 శాతం బుక్‌ అయినట్లు తెలిపారు. క్యాపిటల్‌ రాజధానిగా ప్రకటించిన తర్వాత  విశాఖ వేదికగా పలు కార్యక్రమాలు జరుగుతుండటంతో హోటల్, ట్రావెల్స్‌కు డిమాండ్‌ పెరిగినట్లు ఆయా రంగాల ప్రతినిధులు తెలిపారు.

బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌ను ప్రచారం చేస్తున్నాం
విశాఖకు ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. విశాఖను అంతర్జాతీయంగా ప్రమోట్‌ చేసే విధంగా బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌పై అత్యధికంగా దృష్టి పెట్టాం. వచ్చే ఏడాది నుంచి విశాఖ రాజధానిగా ప్రభుత్వ కార్యకలపాలను ఇక్కడ నుంచే కొనసాగిస్తుంది.
– గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి

హై ఎండ్‌ ఐటీ హబ్‌గా వైజాగ్‌
టెక్నాలజీ రంగంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటూ హై ఎండ్‌ టెక్నాలజీ కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా నాల్గవ తరం టెక్నాలజీ ఇండస్ట్రీ–4లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా జనవరి 20, 21 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇన్ఫినిటీ వైజాగ్‌ పేరుతో ఐటీ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నాం.
– శ్రీధర్‌ కోసరాజు, ప్రెసిడెంట్, ఐటాప్‌

హోటల్‌ గదులకు డిమాండ్‌ పెరిగింది
మార్చి, ఏప్రిల్‌లో జరిగే సదస్సుల నిమిత్తం ఇప్పటి నుంచే బుకింగ్స్‌ మొదలయ్యాయి. ముఖ్యంగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్, జీ–20 సమావేశాల తేదీల్లో స్టార్‌ హోటల్స్‌ గదులకు డిమాండ్‌ అధికంగా ఉంది. ఇప్పటికే కొన్ని హోటల్స్‌లో గదులు 100 శాతం బుక్‌ అయ్యాయి. కోవిడ్‌ తర్వాత ఈ స్థాయిలో గదులు నిండటం ఇదే తొలిసారి.
– పవన్‌ కార్తీక్‌ ఎంవీ, వైస్‌ ప్రెసిడెంట్, హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ

మరిన్ని వార్తలు