జనారణ్యంలోకి ఏనుగులు రాకుండా నియంత్రణ

28 Apr, 2021 04:49 IST|Sakshi

రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి ప్రతీప్‌కుమార్‌

కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సంరక్షణపై అంతర్రాష్ట్ర సమావేశం  

సాక్షి, అమరావతి: జనారణ్యంలోకి ఏనుగులు రాకుండా నియంత్రించడంతో పాటు వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని అంతర్రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య అధికారుల సమావేశం నిర్ణయించింది. ఏనుగుల సంరక్షణపై ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ ముఖ్య అధికారుల సమావేశం మంగళవారం వర్చువల్‌ విధానంలో జరిగింది. గుంటూరులోని కార్యాలయం నుంచి రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ మాట్లాడారు. ఏనుగులు తరచూ జనారణ్యంలోకి, పంట పొలాల్లోకి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోందన్నారు. ఏనుగులు అడవులు దాటి బయటికి రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ.. తమిళనాడు, కర్ణాటక నుంచి తరచుగా ఏనుగులు ఏపీలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు.

రైతులు వన్యప్రాణుల నుంచి రక్షణగా కరెంటు తీగలను అమర్చడం వల్ల అవి మరణిస్తున్నాయన్నారు. ఏనుగుల తరలింపు కోసం తమిళనాడు సిబ్బంది కాల్పులు జరుపుతుండడం వల్ల అక్కడి ఏనుగులు కౌండిన్య వైపు వస్తున్నాయ ని పేర్కొన్నారు. అలాగే కర్ణాటక నుంచి ఇంకొన్ని కుప్పం మీదుగా ఇదే అడవుల్లోకి వస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం తరచూ సమావేశం కావాలని, సమన్వయంతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. మూడు రాష్ట్రాలను కలుపుతూ ఎలిఫెంట్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశముందని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు