ఆర్గానిక్‌ బ్రాండ్‌తో అరకు కాఫీకి.. అంతర్జాతీయ క్రేజ్‌

28 May, 2023 04:54 IST|Sakshi

అరకు కాఫీ, మిరియాలకు ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌

ఈ మేరకు అపెడా ఆమోదం   

ఇప్పటికే అంతర్జాతీయ విపణిలో ఆర్గానిక్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ 

దీంతో గిరిజన కాఫీకి మరింత మంచి ధరలు.. రైతులకు మేలు

సాక్షి, అమరావతి : అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్‌ ఉన్న అరకు వ్యాలీ కాఫీకి ఆర్గానిక్‌ బ్రాండ్‌ మరింత క్రేజ్‌ తేనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే అరకు వ్యాలీ కాఫీ, మిరియాలకు సేంద్రియ ధ్రువపత్రం(ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌) లభించింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(అపెడా) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నాలుగేళ్లుగా చేస్తున్న కృషి ఫలించింది. దీనివల్ల గిరిజన రైతులు పండించిన కాఫీ, మిరియాలకు అంతర్జాతీయ మార్కెట్లో మరింత మంచి ధరలు దక్కనున్నాయి.  

ఫలించిన నాలుగేళ్ల కృషి 
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజన్‌ పరిధిలోని గొందిపాకలు, లంబసింగి, కప్పాలు క్లస్టర్లలో 1,300 మంది గిరిజన రైతులు 2184.76 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలకు సేంద్రియ ధ్రువపత్రం సాధించడం కోసం నాలుగేళ్లుగా కృషి జరిగింది. తొలుత గొందిపాకలు గ్రామానికి చెందిన రైతులు సేంద్రియ సాగులో ముందున్నారు. గ్రామంలోని రైతులంతా కలసి గిరిజన గ్రామ స్వరాజ్య సంఘంగా ఏర్పడి సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు.

ఎరువులు వేయకుండా సేంద్రియ పద్ధతుల్లోనే కాఫీ, అంతర పంటగా మిరియాలను పండిస్తున్నారు. గొందిపాకలుతో పాటు లంబసింగి, కప్పలు గ్రామాల్లో రైతులతోనూ సమావేశాలు నిర్వహించిన జీసీసీ సేంద్రియ సాగును ప్రోత్సహించింది. దీంతో మూడేళ్లుగా క్రమం తప్ప­కుండా స్కోప్‌ సర్టిఫికెట్‌ వచ్చేలా జీసీసీ కృషి చేసింది. మూడేళ్లపాటు దీనిపై సునిశిత అధ్యయనం పూర్తికావడంతో నాల్గో ఏడాది సేంద్రియ సాగు ధ్రువపత్రం జా­రీకి అపెడా ఆమోదం తెలిపింది. దీంతో తొలి విడత­లో చింతపల్లి మండలంలోని 2,184.76 ఎకరాల్లో కా­ఫీ సాగు చేస్తున్న దాదాపు 1,300 మంది గిరిజన రై­తు­లకు సేంద్రియ ధ్రువపత్రాలు అందించనున్నారు.

ఇదే తరహాలో జీకే వీధి, పెదవలస, యెర్రచెరువులు క్లస్టర్లలో మరో 1,300 మంది రైతులు సుమారు 3,393.78 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలు పంటలకు ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి వాటికీ సేంద్రియ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. కాగా, ఒక పంటకు సేంద్రియ ధ్రువపత్రం సాధించడం అంత తేలిక కాదు. ఇందుకు పెద్ద కసరత్తే ఉంటుంది.

థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్, ప్రతి విషయం ఆన్‌లైన్‌ వెరిఫికేషన్, ఆన్‌లైన్‌ అప్డేషన్, ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రం జియో ట్యాగింగ్, వాటన్నింటినీ ఎప్పటికప్పు­డు అప్‌డేట్‌ చేయడం వంటివి ఏ మాత్రం ఏమరుపా­టు లేకుండా నిర్వహించాలి. వీటన్నిటినీ జీసీసీ అధి­కారులు సకాలంలో విజయవంతంగా పూర్తిచేశారు.

మరో మైలురాయి  
సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో జీసీసీ సమర్థంగా సేవలందిస్తోంది. ఇప్పటికే సేంద్రియ బ్రాండింగ్‌తో నాణ్యమైన పసుపు, తేనెను టీటీడీకీ సరఫరాచేస్తున్నా. తాజాగా నాలుగేళ్ల కృషి ఫలించడంతో కాఫీ, మిరియాల సాగుకు సేంద్రియ సాగు ధ్రువపత్రం దక్కడం జీసీసీ చరిత్రలో మరో మైలు­రాయి. ఇది సాధించినందుకు గర్వంగా ఉంది.  – శోభ స్వాతిరాణి, చైర్‌పర్సన్, గిరిజన సహకార సంస్థ   

మరిన్ని వార్తలు