సాధనతో ఆరోగ్య యోగం

21 Jun, 2022 23:45 IST|Sakshi
యోగా విన్యాసం చేస్తున్న శిల్ప, విద్యార్థులకు యోగా శిక్షణ 

యోగా ప్రచారంలో దూసుకెళుతున్న శిల్ప

నేడు అంతర్జాతీయ  యోగా దినోత్సవం

మదనపల్లె సిటీ: నాటి కాలంలో ధ్యానం, చక్కటి ఆహారపు అలవాట్లుతో జీవనం సాగేది. ప్రస్తుతం అడుగడుగునా ఆధునికత రంగులు పులుముకుంటున్న వేళ వివిధ రకాల అనారోగ్యాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు, మానసిక ప్రశాంతతకు ఇటీవల కాలంలో పలువురు యోగాపై మక్కువ పెంచుకుని సాధన అలవాటుగా మార్చుకున్నారు.  చిన్నారుల నుంచి  వృద్ధుల వరకు చాలా మంది యోగాపై మక్కువ చూపుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా గురువు శిల్ప  గురించి ప్రత్యేక కథనం..

12 ఏళ్లుగా తర్ఫీదు..
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శిల్ప వివాహానంతరం మదనపల్లెలో స్థిరపడ్డారు. 2010లో శిల్ప బెంగుళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసాధన సంస్థలో ప్రత్యేక శిక్షణ పొందారు. 2011 నుంచి పట్టణంలో పలు పాఠశాలల్లో యోగాపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణిస్తున్నారు. ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులకు యోగా నేర్పిస్తూ ఆరోగ్య పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. సుమారు 12 సంవత్సరాలుగా పట్టణంలోని పలు పాఠశాలల్లో యోగాపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

►జాతీయ స్థాయిలో ఆలిండియా కల్చర్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో 2012లో హైదరాబాదులో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. యోగాలో ప్రత్యేక ప్రతిభ కనబరిచినందుకు అప్పటి తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు.

గురువుల పర్యవేక్షణలో ఆసనాలు సాధన చేయాలి..
యోగాసనాలు నిత్య జీవితంలో జరిగే క్రియల్లో భాగం కావాలి. అనారోగ్యం పేరుతో వేలాది రూపాయలు ఔషధాలకు వినియోగించేకంటే, రోజు కొంత సమయం వ్యక్తి గత ఆరోగ్యం కోసం కేటాయించి గురువుల పర్యవేక్షణలో ఆసనాలు సాధన చేస్తే రోగాలకు దూరంగా ఉండొచ్చు. చిన్నతనం నుంచి యోగాసనాలపై ఆసక్తితో నిష్ణాతులైన గురువుల శిక్షణలో సాధన చేశాను. 
– శిల్ప, యోగా గురువు, మదనపల్లె

మరిన్ని వార్తలు