చిన్న వయసు.. పెద్ద ఆలోచన

28 Jul, 2022 04:54 IST|Sakshi
కొరిశపాటి గోభాను శశాంకర్‌

సింహపురి చిన్నోడికి అంతర్జాతీయ ఖ్యాతి 

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు వడ్డీలేని రుణాలు

42 మంది విద్యార్థులతో ఏర్పాటైన ‘స్విఫ్ట్‌’ సంస్థ

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే అకౌంట్‌కు రుణం జమ

రెండేళ్లలో రూ.60 లక్షల పంపిణీ

రుణాల రికవరీలో 98 శాతం 

ప్రిన్స్‌ డయానా అవార్డుకు ఎంపిక

చిన్న హృదయంలో తట్టిన ఆలోచన ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సేవా దృక్పథంతో 42 మంది విద్యార్థులు ఏకమై ఓ సంస్థను నెలకొల్పారు. సింహపురి చిన్నోడి మదిలో మెదిలిన ఆలోచన దేశ, విదేశాలల్లోని విద్యార్థులను కదిలించగా.. వారి దన్నుతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ‘స్విఫ్ట్‌’ సంస్థ వెలిసింది. రెండేళ్లుగా వడ్డీలేని సూక్ష్మ రుణాలను అందిస్తూ.. లండన్‌ ప్రిన్స్‌ విలియమ్స్‌ మనసు గెలుచుకుని.. ‘ప్రిన్స్‌ డయానా’ అవార్డు దక్కించుకున్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని రాంజీనగర్‌కు చెందిన కొరిశపాటి గోభాను శశాంకర్‌ అనే విద్యార్థికి పట్టుమని పదిహేడేళ్లు కూడా లేవు. మస్కట్‌లోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్నాడు. మైక్రో ఫైనాన్స్‌పై ఆసక్తి పెంచుకుని వినూత్న సేవపై దృష్టి సారించాడు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను ఆదుకోవడం కోసం 2019 డిసెంబరులో ‘సస్టెయినింగ్‌ ఉమన్‌ ఇన్‌ మైక్రో ఫైనాన్స్‌ టర్మేయిల్‌’ (స్విఫ్ట్‌) పేరిట సూక్ష్మ రుణ సంస్థను ప్రారంభించాడు. దీనికి 42 మంది తోటి విద్యార్థుల మద్దతు లభించింది.

వారంతా కలిసికట్టుగా పని చేస్తామని ధ్రువీకరిస్తూ విధి విధానాలను షేర్‌ చేసుకున్నారు. అలా ప్రారంభమైన స్విఫ్ట్‌ సంస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలందించాలనే లక్ష్యం మేరకు నిరాటంకంగా రుణాలందిస్తున్నారు. రెండేళ్లలో వ్యక్తిగత, గ్రూపులతో కలిసి 1,450 రుణాలను మంజూరు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు రూ.60 లక్షలను ఆన్‌లైన్‌ ద్వారా అందించారు.


రూ.25 లక్షలతో ప్రారంభం 
విద్యార్థులతో ఏర్పాటైన ఈ సంస్థ రూ.25 లక్షలతో మైక్రో ఫైనాన్స్‌ కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఆ సంస్థ ఓ ప్రశ్నావళిని (క్వశ్చనీర్‌) ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచుతోంది. రుణం అవసరమైన వారు దానిని నింపితే.. వారి బ్యాంక్‌ ఖాతాకు రుణం జమ అవుతోంది. ఇలా రుణం పొందిన మహిళలు వారు తీసుకున్న మొత్తం ఆధారంగా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంది.

ఒక్కొక్కరికీ రూ.2,500 నుంచి రూ.40 వేల వరకు రుణం అందించారు. వారిలో గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందిన వారూ ఉన్నారు. స్విఫ్ట్‌ సంస్థకు రుణగ్రహీతల నుంచి కూడా మంచి సహకారం దక్కుతోంది. 98 శాతం మంది రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. ఇలా ప్రస్తుతం రూ.60 లక్షలను వివిధ వృత్తులు, వ్యాపారాల్లో ఉన్న మహిళలకు రుణాలుగా అందించారు.

ప్రిన్స్‌ డయానా అవార్డుకు ఎంపిక 
సామాజిక దృక్పథం, మానవీయ విలువలు ఉన్న వారికి దివంగత లండన్‌ రాణి డయానా అవార్డును ప్రిన్స్‌ విలియమ్స్‌ ఏటా అందిస్తారు. విద్యార్థులతో ఏర్పాటైన స్విఫ్ట్‌ సంస్థ ఈసారి ప్రిన్స్‌ విలియమ్స్‌ మనసు గెల్చుకుంది. చిన్న వయసులో సామాజిక దృక్పథంతో.. లాభాపేక్ష లేకుండా సోషల్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా మహిళలకు అండగా నిలుస్తున్న స్విఫ్ట్‌ సంస్థను డయానా అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్విఫ్ట్‌ సంస్థకు ఈ–మెయిల్‌ ద్వారా తెలియజేశారు. 

మరింత బాధ్యత పెరిగింది
ప్రిన్స్‌ డయానా అవార్డు దక్కడం సంతోషంగా ఉంది. మహిళలకు దన్నుగా నిలవాలనే దృక్పథంతో ఆర్థికంగా చేయూత అందిస్తూ వడ్డీ లేని సూక్ష్మ రుణాలు ఇస్తున్నాం. నా తోటి 42 మంది విద్యార్థులతో స్విఫ్ట్‌ సంస్థను ఏర్పాటు చేశాం. swiftmfi.org వెబ్‌సైట్‌ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం.
– గోభాను శశాంకర్, స్విఫ్ట్‌ ఫౌండర్‌ 

మరిన్ని వార్తలు