బియ్యంతో లాభం లేదు, ‘చిరు’కు జైకొడితేనే బెటర్‌!

4 May, 2021 03:49 IST|Sakshi

కరోనాపై ‘చిరు’ ఆయుధం

ప్రజలు ఆహారపు అలవాట్ల రూటు మార్చాలి 

చిరుధాన్యాల బాట పట్టాలి 

మానవాళికి అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ విజ్ఞప్తి 

స్మార్ట్‌ ఫుడ్‌తో ఇమ్యూనిటీ.. జీవనశైలి వ్యాధులకు చెక్‌ 

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ ప్రజలు ఇకనైనా తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) సూచించింది. పౌష్టికాహారం, రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) కోసం చిరు ధాన్యాల బాట పట్టాలని విజ్ఞప్తి చేసింది. ఆహార, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కొత్త దిశా నిర్దేశం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రకటిస్తూ.. నీటి ఆధారిత పంటల్ని, సాగు పద్ధతుల్నీ మార్చాలని కోరింది. ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు మారడంతో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గి కరోనా వంటి వైరస్‌ సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల వాడకంతో శరీరానికి కావాల్సిన పోషకాలను సమృద్ధిగా సమకూర్చుకోవచ్చు. తద్వారా ఇమ్యూనిటీని పెంపొందించుకోవచ్చని హోంసైన్స్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు.  

చిరు ధాన్యాలే కదా అని.. చిన్న చూపు కూడదు 
పూర్వ కాలం నుంచి చిరు ధాన్యాల సాగు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో మరుగున పడిపోయింది. ఆ స్థానాన్ని వరి ఆక్రమించింది. ఆధునిక జీవన శైలిలో బియ్యం, ప్రత్యేకించి పాలిష్‌ చేసిన బియ్యం రకాల వాడకం పెరిగింది. పోషకాలు లేని బియ్యం రకాల వినియోగంతో ఫలితం లేదని శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు చాలా కాలం నుంచే చిరుధాన్యాల వినియోగాన్ని పెంచాలని చెబుతున్నారు. దేశంలోని జాతీయ పోషకాహార సంస్థ సైతం చిరు ధాన్యాలను చిన్న చూపు చూడొద్దని హెచ్చరించింది.

ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ముందుచూపుతో చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చిరు ధాన్యాల సాగుకు చర్యలు చేపట్టడమే కాకుండా, చిరు ధాన్యాలకూ మద్దతు ధర ప్రకటించిన తరుణంలోనే.. ఎఫ్‌ఏవో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం గమనార్హం. 

స్మార్ట్‌ ఫుడ్‌తో జీవనశైలి వ్యాధులు దూరం 
జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, సామలు, రాగులు వంటి చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. పోషక లోపాలు దరిచేరకుండా ఇవి ఒక కవచంలా పని చేస్తాయి. పోషకాలను అందించడంలో బియ్యం, గోధుమల కంటే చిరుధాన్యాలు మేలైనవి. అందుకే వీటిని స్మార్ట్‌ ఫుడ్‌గా కూడా అభివర్ణిస్తున్నారు. ఊబకాయం, షుగర్, బీపీ వంటి జీవనశైలి వ్యాధులను దూరం చేయడంలో చిరుధాన్యాలు ఉపయోగపడుతున్నందున ప్రజలు వీటిని ఎక్కువగా 
వాడాలి.     
– టి.గోపీకృష్ణ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త 

రాష్ట్రంలో చిరుధాన్యాలకు పూర్వవైభవం 
రాష్ట్రలో చిరుధాన్యాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటి సాగును ప్రోత్సహించేందుకు చిరు ధాన్యాల బోర్డుల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. దేశంలోనే తొలిసారిగా కొన్ని రకాల చిరుధాన్యాలకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతుల్ని ప్రోత్సహిస్తోంది.  
    – డాక్టర్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌  

మరిన్ని వార్తలు