సీఎం జగన్‌ను కలిసిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌ కార్తీక్‌రెడ్డి

22 Sep, 2022 18:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో ఏపీకి చెందిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌ అరబండి కార్తీక్‌ రెడ్డి గురువారం కలిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను  ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం అన్నారు. కరాటేను శాప్‌ క్రీడగా గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
చదవండి: ఏపీలో సీఎం జగన్ పాలన అద్భుతం: మంత్రి కేటీఆర్ 

ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ కరాటే చాంపియన్‌ షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, అండర్‌ 16 బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో స్వర్ణపతక విజేతగా  కార్తీక్‌ నిలిచాడు. అంతకుముందు ఏప్రిల్‌లో లాస్‌వేగాస్‌లో జరిగిన యూఎస్‌ఏ ఓపెన్‌ ఛాంపియన్‌ షిప్‌లోనూ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో వరసగా రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి ఇండియన్‌ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అక్టోబర్‌లో టర్కీలో వరల్డ్‌ కరాటే ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అఫిషియల్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొని పతకం సాధిస్తానని కార్తీక్‌ తెలిపారు.

తాను సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపి, తనకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎంని కార్తీక్‌ కోరగా, సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం, మున్ముందు కార్తీక్‌ అవసరమైన పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్‌కే రోజా, కార్తీక్‌ తల్లిదండ్రులు శిరీషా రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్‌కేడీఏఏపీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మిల్టన్‌ లూథర్‌ శాస్త్రి, ప్రవీణ్‌ రెడ్డి, కృష్ణారెడ్డి  ఉన్నారు.

మరిన్ని వార్తలు