కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి 

29 Aug, 2020 09:45 IST|Sakshi

భౌగోళిక గుర్తింపుతో మరింత అభివృద్ధి

ఫలించిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కృషి

చిరకాల వాంఛ తీరిందంటున్న రైతులు  

ఎన్నో ఏళ్లుగా విదేశాలకు ఎగుమతి అవుతూ, ప్రత్యేకతను సంతరించుకున్నా అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న కృష్ణాపురం (కేపీ) ఉల్లి పంటకు మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భౌగోళిక గుర్తింపు లభించింది. దీంతో పంట అభివృద్ధికి బంగారుబాట ఏర్పడింది. రైతులకు కూడా మేలు చేకూరనుంది. 

కడప అగ్రికల్చర్‌/మైదుకూరు: కృష్ణాపురం (కేపీ) ఉల్లి పంటకు అరబ్‌ దేశాల్లో గిరాకీ ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ కల్పించింది. దీంతో రైతులు, రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప పార్లమెంటు సభ్యు లు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్‌. రఘురామిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుసార్లు కేపీ ఉల్లికి గుర్తింపు ఇవ్వాలని విన్నవించడంతోనే ఇది సాధ్యమైందని రైతులు అంటున్నారు. బ్రిటీష్‌ వైశ్రాయ్‌ల పరిపాలనా కాలంలో కేపీ ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతూ వస్తోంది. మద్దతు ధర కల్పించాలని, పంట కనుమరుగై పోకుండా కాపాడాలని రైతు సంఘాలు పోరాటాలు చేశాయి. అయినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గ రగా చూశారు. కుదేలైన వ్యవసాయానికి జవసత్వాలు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. కేపీ ఉల్లి పంటకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) వచ్చేలా సహాయ సహకారాలు అందించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విదేశీ ఎగుమతులకు ఢోకా ఉండదని, పంట పండినట్లేనని రైతులు అంటున్నారు.  

మైదుకూరు ప్రాంతం నుంచి కడపకు వచ్చే కేసీ కెనాల్‌ ద్వారా ఉల్లిగడ్డలు కడప సమీపంలోని కృష్ణాపురం రైల్వేస్టేషన్‌ వరకు పడవల ద్వారా రవాణా అయ్యేవని పెద్దలు సాహితీ వేత్త విద్వాన్‌ కట్టా నరసింహులు చెప్పారు. అక్కడి నుంచి నాటి మద్రాసు నేటి చెన్నై ఓడరేవు వరకు రైలులో వెళ్లేదన్నారు.అక్కడి నుంచి బ్రిటీషు వాళ్లు వారి దేశానికి ఎగుమతి చేసుకునే వారన్నారు. కేపీ ఉల్లిగడ్డలను మందులలో ముడి పదార్థంగా వాడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.గత టీడీపీ ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులను ఛీకొడుతూ వచ్చింది. ఎగుమతులు లేని పంటను ఎందుకు సాగు చేయాలని నాటి సీఎం, నేటి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అప్పట్లో తెగేసి చెప్పినట్లు రైతులు చర్చించుకుంటున్నారు. 

బ్రిటీష్‌ కాలం నాటి నుంచి పంట సాగు.....: 
బ్రిటీష్‌ వారి పరిపాలనా కాలం నుంచి కర్ణాటకలో మొదలై అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం జిల్లా మార్కాపురం వరకు ఈ పంట సాగవుతూ చిట్టిబళ్లారి, చిన్న బళ్లారి, రెడ్‌లేడీ, అగ్రిబ్రౌన్‌ రోజ్‌గా రూపాంతరం చెందింది. కేపీ ఉల్లిగా పేరు తెచ్చుకుని విస్తరించింది. రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో లక్షల హెక్టార్లలో ఏటా సాగవుతూ ఉండేది. అయితే మన ప్రభుత్వాలు పంట దిగుబడిని ఎగుమతులు ఇవ్వకుండా మొండికేస్తూ వచ్చాయి. ధరలు పతనమవుతూ రావడంతో రైతులు పంట సాగు చేయడం తగ్గిస్తూ వచ్చారు. అయితే వైఎస్సార్‌ జిల్లాలోని మైదుకూరు కేంద్రంగా మైదుకూరు, ఖాజీపేట, దువ్వూరు, బ్రహ్మంగారి మఠం, సింహాద్రిపురం, వీరపునాయునిపల్లె, కలసపాడు, పోరుమావిళ్ల, కాశినాయన మండలాలు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాలు, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని మండలాల్లో మాత్రమే సాగవుతోంది.  

సంతోషకరం 
కేపీ ఉల్లి చారిత్రక పంట. బ్రిటిష్‌ కాలం కంటే ముందే ఈ పంటను రైతులు సాగు చేశారు. అయితే ఎన్నో ఏళ్లు ప్రభుత్వాలు కేపీ ఉల్లి రైతులను పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈ పంటకు భౌగోళిక గుర్తింపు రావడం సంతోషకరం.
 – లెక్కల వెంకటరెడ్డి, కేపీ ఉల్లి రైతుల సంఘం నాయకుడు, మైదుకూరు

రైతు సంఘాల కృషి వల్లే 
రైతు సంఘాలు ఉద్యమాలు చేయడం వల్లే కేపీ ఉల్లి రైతులకు మేలు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు భౌగోళిక గుర్తింపు వల్ల పంటను అభివృద్ధి చేయాలి.  
– రాజమోహన్‌రెడ్డి, కేపీ ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం నాయకుడు, మైదుకూరు.  

మరిన్ని వార్తలు