ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి

8 May, 2022 03:08 IST|Sakshi

విత్తు నుంచి విక్రయం దాకా రైతన్నకు అండగా ఆర్బీకేలు

పలు అవార్డులు, అంతర్జాతీయంగా ప్రశంసలు

ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా రైతు భరోసా కేంద్రాలు

తెలంగాణలో కాల్‌ సెంటర్, ఆర్బీకే తరహా చానల్‌కు ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు తోడుగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందడంతోపాటు తాజాగా ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మక అవార్డు ‘చాంపియన్‌’కు నామినేట్‌ అయిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు)అందిస్తున్న సేవలను అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. 

వన్‌ స్టాప్‌ సెంటర్‌..
సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకే చేర్చే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. నాలెడ్జ్‌ హబ్‌లుగా రూపుదిద్దుకుని నాణ్యమైన ఇన్‌పుట్స్‌ అందిస్తున్నాయి. వైఎస్సార్‌ పొలం బడులతో పాటు తోట, పట్టు, పశు విజ్ఞాన, మత్స్యసాగులో రైతులకు మెళకువలు సూచిస్తున్నాయి. పంట ఉత్పత్తులను గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నాయి. కూలీల కొరతను అధిగమించేందుకు వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలు, మార్కెటింగ్‌ కోసం మల్టీపర్పస్‌ ఫెసిలిటీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆర్బీకేలకు అనుబంధంగా సమీకృత రైతు సమాచార కేంద్రం, ఆర్బీకే ఛానల్‌ను తీసుకొచ్చింది. ఇలా ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను ‘వన్‌ స్టాప్‌’ సెంటర్‌ కింద అందుబాటులోకి తెచ్చింది. 

ప్రముఖ సంస్థల అధ్యయనం..
పలు రాష్ట్రాలు ఆర్బీకేల తరహా వ్యవస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాల బృందాలు ఏపీలో పర్యటించి ఆర్బీకేల పనితీరుపై అధ్యయనం చేశాయి. నీతి ఆయోగ్, నాబార్డు, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌), ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్, ఆర్బీఐ.. ఇలా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆర్బీకేలపై అధ్యయనం చేపట్టాయి.

కాల్‌సెంటర్‌ సేవలు...
టోల్‌ఫ్రీ నంబర్‌ 155251 ద్వారా ఇప్పటి వరకు 4.50 లక్షల మంది రైతులు  సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కాల్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలు, 70 మందికి పైగా సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామ సేవలందిస్తున్నారు. 1.75 లక్షల సబ్‌స్క్రిప్షన్‌తో ఆర్బీకే ఛానల్‌ అంతర్జాతీయ మన్నన్నలందుకుంటోంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 680కు పైగా వీడియోలను ఛానల్‌ ద్వారా అప్‌లోడ్‌ చేశారు. 

తెలంగాణలో కాల్‌ సెంటర్, రైతు ఛానల్‌
ఆర్బీకేల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ‘రైతు వేదిక’ల ద్వారా సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ఆర్బీకేలను పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వాటి సేవలు ఎంతో బాగున్నాయని అభినందించారు. ఆర్బీకే వ్యవస్థ వినూత్నమని ప్రశంసించారు. ఈ సేవలను తెలంగాణ రైతులకు కూడా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, స్పెషల్‌ కమిషనర్‌ కేజే హనుమంత్‌ నేతృత్వంలోని బృందాలు కూడా పలు దఫాలు ఆర్బీకేలపై అధ్యయనం చేశాయి.

ఆ బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆర్బీకేల తరహా సేవలను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా సమీకృత రైతు సమాచార కేంద్రం (కాల్‌ సెంటర్‌), ఆర్బీకే ఛానల్‌ తరహాలో రైతు ఛానల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆర్బీకేల్లో డిజిటల్‌ లైబ్రరీలతో పాటు అత్యుత్తమ ప్రమాణాలతో శాఖలవారీగా ఆకట్టుకునే రీతిలో మ్యాగజైన్లను తెస్తున్నారు. లక్ష మందికిపైగా చందాదారులతో రైతుభరోసా మ్యాగజైన్‌ విశేష ఆదరణ æపొందుతోంది. తెలంగాణలో కూడా శాఖలవారీగా మ్యాగజైన్లు తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.  

మరిన్ని వార్తలు