International Yoga Day 2022: యోగాతో ఎన్ని ప్రయోజనాలో.. ఈ లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

20 Jun, 2022 18:27 IST|Sakshi

మచిలీపట్నం(కృష్ణా జిల్లా): ఉరుకులు, పరుగుల జీవన గమయనంలో సరైన వ్యాయామం లేక మనిషి ఆరోగ్యం దెబ్బతింటోంది. చదువులు, కొలువులు, ఇళ్లల్లో సపరిచర్యలతో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురువుతున్నారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రోజులో కొంత సమయమైనా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న జనం వీటిపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అందుకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగా వైపు ప్రజలు దృష్టి సారించేలా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.
చదవండి: బూమ్‌.. బూమ్‌ సాఫ్ట్‌వేర్‌.. కంప్యూటర్‌ కోర్సులదే హవా..

రేపు జిల్లా వ్యాప్తంగా వేడుకలు 
అంతర్జాతీయ 8వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మచిలీపట్నంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లా స్థాయి వేడుక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్య, ఆయుష్‌, సమాచార, విద్యుత్, స్పోర్ట్స్‌ అథారిటీ, ఎలక్ట్రికల్, ముని సిపల్‌ శాఖల జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే రీతిన గుడివాడ, ఉయ్యూరు, డివిజన్‌ కేంద్రాల్లో ఆర్డీఓల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించారు.

ఆసనాలతో ఆరోగ్యం 
యోగాలో భాగంగా వివిధ రకాల ఆసనాలు      వేయటం ద్వారా ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది. ఒక్కో ఆసనం ద్వారా ఒక్కో రకమైన అనారోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుంది  

తాడాసనం: ఈ ఆసనం ఎత్తు పెరగడానికి సహకరిస్తుంది. పొత్తి కడుపు, వెన్నెముక నిటారుగా సాగడం ద్వారా జీర్ణ కోశం శుభ్రమవుతుంది. పేగుల్లో, పొట్టలో కొవ్వులను కరిగింది ఆరోగ్య  వంతంగా చేస్తుంది.

వృక్షాసనం: రోజూ ఈ ఆసనం చేస్తే కాళ్ల కీళ్లు, మోకాళ్లు చీలమండల సడలించబడతాయి. కాళ్ల కండరాలకు సుభావన కలుగ జేస్తుంది. కీళ్ల             (రుమాటిక్‌) నొప్పులు తగ్గుతాయి.

వజ్రాసనం: ఈ ఆసనం ద్వారా తొడ, పిక్క కండరాలకు సుభావన కలుగుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. వెన్నెముకకు ఆధారమై నిటారుగా ఉంటుంది. ఈ ఆసనం చేస్తే ఆయాసం తగ్గుతుంది.

భుజంగాసనం: అధిక శ్రమ మల్ల కలిగే నడుం నొప్పులు తొలగిపోతాయి. స్థాన చలనం కల వెన్నెముక పూసలు యథాస్థానానికి వస్తాయి. మెడ నొప్పులు, ఉబ్బసం రోగులకు ఈ ఆసనం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. భోజనాలు చేసిన తరువాత వాయువులు (గ్యాస్‌ ట్రబుల్‌) వెళ్లే వారికి ఇది మంచి ఆసనం, వాత రోగాలు తగ్గుతాయి.

పవన ముక్తాసనం: పవన అంటే గాలి, ముక్త అంటే విడిచి పెట్టడం. కడుపులోని చెడుగాలిని బయటకు పంపడం ఈ ఆసనంలో ప్రత్యేకత. మలబద్ధకం, తరచు వచ్చే త్రేన్పులు తగ్గి జీర్ణ శక్తి వృద్ధి చెందుతుంది. వెన్నెముక వెనుక కండరాలు, నరాలు ఉత్తేజమవుతాయి.  

ప్రాణాయామం–నాడీ శోధనం: గాలి రాక పోకలను క్రమపరుస్తుంది. మనస్సుకు ఏకాగ్రత ఇస్తుంది. హెచ్చు రక్తపోటుగలవారు కూడా దీనిని చేయవచ్చు.  

పద్మాసనం: జ్ఞానానికి, మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రత సాధనకు ఇది ఎంతో ఉపయుక్తకరమైన ఆసనం. రుషులు, మహర్షులు ఇదే ఆసనాన్ని చేసేవారు.  

భ్రామరీ ప్రాణాయామం: ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.

అందరికీ ఆరోగ్యమే లక్ష్యం 
అందరికీ ఆరోగ్యమే   లక్ష్యంగా ఆయుష్‌ విభాగం ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నాం. యోగా ఆవశ్యకతను అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజల్లో కూడా దీనిపై ఆసక్తి పెరిగింది. కలెక్టర్‌ సూచనల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రజలంతా దీనిలో పాల్గొనాలి.  
– డాక్టర్‌ కల్పన, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు, మచిలీపట్నం 

యోగా సర్వరోగ నివారిణి 
యోగా చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతి రోజూ యోగా చేసే వారిలో శారీరకంగానే కాక, మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. ప్రజానీకంలో మార్పు కనిపిస్తోంది. యోగాకు ఆదరణ పెరుగుతోంది. ప్రత్యేక శిబిరాల ద్వారా మరింత చైతన్యం తీసుకొస్తున్నాం. 
– జి.గురునాథబాబు, యోగా గురువు, మచిలీపట్నం  

మరిన్ని వార్తలు