గ్రామగ్రామానికీ ఇంటర్నెట్‌ 

22 May, 2022 04:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా చింటూరు మండలం పేగ గ్రామం అడవి మధ్యలో ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి సరిహద్దు దండకారణ్యానికి ఆనుకొని ఈ గ్రామం ఉంది. ఆ ఊరిలో మొబైల్‌ ఫోను సిగ్నల్స్‌ కూడా ఉండవు. ఊరంతా తిరిగితే ఎక్కడో ఓ చోట అప్పుడప్పుడూ ఫోను సిగ్నల్స్‌ వచ్చిపోతుంటాయి.

అలాంటి కుగ్రామంలో సైతం అంతరాయం లేకుండా నిరంతరం ఇంటర్నెట్‌ సౌకర్యం ఉండేలా ప్రభుత్వం ఇటీవల కేబుల్‌ను ఏర్పాటు చేసింది. మొబైల్‌ ఫోనుకు సైతం ఇంటర్నెట్‌ అందని ఇటువంటి గ్రామాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం కేబుల్‌ ఇంటర్నెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. 5,929 గ్రామాలకు దాదాపు రూ. 76 కోట్లు ఖర్చుతో కొత్తగా ఇంటర్నెట్‌ కేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 2020 జనవరి 26 నుంచి మారుమూల గ్రామాల్లో సైతం ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది నవంబర్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,929 గ్రామాల్లోని సచివాలయాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ ద్వారానే అక్కడి సిబ్బంది ఆన్‌లైన్‌ సేవలు అందించారు.

మొబైల్‌ సిగ్నల్స్‌ లేనప్పుడు లేదంటే సిగ్నల్స్‌ తక్కువగా ఉన్నప్పుడు ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం కలుగుతుండేది.దీనికి పరిష్కారంగా ఏపీలోని అన్ని గ్రామాలకు కేబుల్స్‌ ద్వారా ఇంటర్నెట్‌ వసతి కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఒకట్రెండు నెలల్లోనే అన్ని గ్రామాల్లో సచివాలయాలకు కేబుల్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

మరిన్ని వార్తలు