‘ఎర్ర’డాన్‌ పెరుమాల్‌ అరెస్టు 

2 Jun, 2022 05:48 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు చూపుతున్న ఎస్పీ , పెరుమాల్‌ (ఫైల్‌)

చిత్తూరు అర్బన్‌: అంతర్‌ రాష్ట్ర స్మగ్లర్, తమిళనాడుకు చెందిన ‘ఎర్ర’డాన్‌ ఎం.పెరుమాల్‌ను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.2.50 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు, రూ.50 లక్షల విలువైన 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి, ఏఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి బుధవారం చిత్తూరులో మీడియాకు వెల్లడించారు. తిరుపతి–బెంగళూరు బైపాస్‌రోడ్డులోని చెర్లోపల్లె క్రాస్‌ వద్ద చిత్తూరు తూర్పు సీఐ కె.బాలయ్య, తాలూకా ఎస్‌ఐ రామకృష్ణ, గుడిపాల ఎస్‌ఐ రాజశేఖర్‌ బుధవారం తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు.

అదే సమయంలో తిరుపతి నుంచి వేలూరు వైపు వస్తున్న మూడు కార్లు, ఓ ఐచర్‌ వ్యాను ఒక్కసారిగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. వాహనంలో ఉన్న తమిళనాడులోని ఇరుంబలికి చెందిన పెరుమాల్‌తో పాటు ఆరణికి చెందిన సి.వేలును అరెస్టు చేశారు. మరో 8 మంది పరారయ్యారు. నిందితుల నుంచి నాలుగు వాహనాలతో పాటు రూ.2.50 కోట్ల విలువ చేసే ఎర్రచందనం ఏ–గ్రేడు దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

14 కేసుల్లో నిందితుడు.. 
33 ఏళ్ల పెరుమాల్‌.. 2014 నుంచే శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్లను కూలీలతో నరికించి స్మగ్లింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. 14 కేసుల్లో నిందితునిగా ఉన్న పెరుమాల్‌ ఏడేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. 2015లో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో విబేధాలు రావడంతో చిన్నయప్పన్‌ అనే వ్యక్తిని పెరుమాల్‌ హత్య చేశాడు. స్మగ్లింగ్‌ ద్వారా దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఆరణిలో రూ.10 కోట్ల విలువైన ఇళ్లు, ఇరుంబలిలో వ్యవసాయ భూములు, కొప్పంలో రూ.20 కోట్ల విలువైన ఇళ్లతో పాటు తిరువన్నామలై జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ఆస్తులను అటాచ్‌ చేయడంతో పాటు పీడీ యాక్టు పెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.  

మరిన్ని వార్తలు