కళల కల‘నేత’

14 Oct, 2022 04:23 IST|Sakshi
నాగరాజు రూపొందించిన చేనేత కళాఖండాలు

పట్టువస్త్రాలపై అద్భుత డిజైన్ల ఆవిష్కరణ

ప్రముఖుల చిత్రాలు, పౌరాణిక గాథలతో నేత

ఆకట్టుకుంటున్న నాగరాజు నేత కళ

సాక్షి, అమరావతి: ‘‘పట్టు వస్త్రంపై ప్రధాని మోదీ ధ్యానముద్ర.. వాల్‌ హ్యాంగింగ్‌ వస్త్రంపై సీఎం వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్న నిలువెత్తు చిత్రం.. పట్టు చీరపై శ్రీరామకోటి, రామాయణ పాత్రలు.. ఇదంతా ఓ చేనేత కార్మికుడి కళల కలబోత’’. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన జూటూరి నాగరాజు.. చేనేతలో నైపుణ్యానికి సాంకేతికతను జోడించి అద్భుతాలు సాధిస్తున్నాడు.

చేనేతలో ఆకట్టుకునేలా నాగరాజు ఆవిష్కరించిన వాటిల్లో కొన్ని.. 
► ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ అందించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాన్ని పట్టు వస్త్రంపై ఎంతో ఆకర్షణీయంగా రూపొందించి.. ఆ వస్త్రాన్ని ‘నేతన్న నేస్తం’ పథకం ప్రారంభ సభలో సీఎం వైఎస్‌ జగన్‌కు, చేనేత, జౌళి శాఖ కమిషనర్‌కు అందజేశాడు.

► బాపట్ల వైఎస్సార్‌సీపీ నేతల కోరిక మేరకు నవరత్న పథకాల పేర్లు, చిత్రాలతో కూడిన రెండు మీటర్ల పొడవైన పట్టు శాలువాను నాలుగు రోజుల స్వల్ప వ్యవధిలోనే నేసి ఇచ్చాడు. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ నడిచి వస్తున్న చిత్రాన్ని సైతం అద్భుతంగా నేశాడు. 

► జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని నేషనల్‌ హ్యాండ్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిర్వహించిన పోటీల్లో అవార్డును సాధించాడు.  

► ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ (తెలంగాణ) ఫొటోతో పాటు ఆయన కుటుంబ సభ్యుల చిత్రాలను కూడా పట్టు వస్త్రంపై నేసి ఇచ్చాడు.

► లేపాక్షి మందిరములో చెక్కిన వందలాది శిల్పాలను అచ్చుగుద్దినట్టు చేనేత మగ్గం ద్వారా పట్టు చీరలో నేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. థాయ్‌లాండ్‌ సంస్కృతికి చెందిన చిహ్నాలు, చార్మినార్, తాజ్‌మహాల్‌ను సైతం పట్టు చీరలపై నేసి ప్రతిభకు పట్టం కట్టాడు. 

► 2017 ఫిబ్రవరిలో ఇస్రో 104 రాకెట్‌లను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించడాన్ని ఆదర్శంగా తీసుకొని ఇస్రో శాటిలైట్‌ శారీని చేనేత మగ్గంపై తయారు చేశాడు. విజయవాడలో జరిగిన ఎగ్జిబిషన్‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆ శాటిలైట్‌ శారీని చూసి నాగరాజును అభినందించారు.  

►  గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి చిత్రం, గాలిగోపురం, తెలుగు అక్షరాలు వచ్చే విధంగా చేనేత మగ్గంపై తయారు చేసి ఔరా అన్పించాడు.

ఆధునికత జోడించాను 
మా తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చేనేతకు ఆదరణ తగ్గిన తరుణంలో దానికి ఆధునికత జోడించి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకున్నాను. డిగ్రీ చదివాను. 25 ఏళ్లుగా చేనేతపైనే ఆధారపడ్డాను. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేనేతలో కొత్త డిజైన్లు ఆవిష్కరిస్తున్నాను.

నా ఉత్పత్తులు పలు దేశాలకు, దేశంలోని ప్రముఖ నగరాలకు ఎగుమతి చేస్తున్నాను. కంప్యూటర్‌ ద్వారా ఆధునిక డిజైన్లను ముద్రించి మగ్గంలోని జకార్డ్, తదితర ఆధునిక పరికరాల సాయంతో వస్త్రాలను నేస్తున్నాను. అనేక పోటీల్లో బహుమతులు సాధించాను. 
–జూటూరి నాగరాజు, ధర్మవరం చేనేత కార్మికుడు 

మరిన్ని వార్తలు