నకిలీ బయో కంపెనీలపై దర్యాప్తు

23 Mar, 2021 04:01 IST|Sakshi
గుంటూరులోని పురుగు మందుల షాపులో తనిఖీ చేస్తున్న ఏడీఏ హేమలత

సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటు

సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: అనుమతి లేని బయో కంపెనీలపై దర్యాప్తు జరిపిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. నకిలీ బయో పెస్టిసైడ్స్‌తో రైతుల్ని నట్టేట ముంచుతున్న కంపెనీలపై వేటు తప్పదని హెచ్చరించారు. ఈ వ్యాపారం వెనకున్న వాళ్లు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ’బయో మాయ’ శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనంపై మంత్రి కన్నబాబు స్పందించారు. బయో ఉత్పత్తుల పేరిట కొన్ని సంస్థలు నకిలీలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో కేసులు వేసి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్న బయో పెస్టిసైడ్స్‌ తయారీ సంస్థలను కట్టడి చేస్తామన్నారు. ఈ వ్యవహారమై సీఎం జగన్‌ కూడా చాలా సీరియస్‌గా ఉన్నారన్నారు. పూర్తి వివరాలతో మంగళవారం మీడియాతో మాట్లాడతానని చెప్పారు. 

స్పందించిన అధికారులు..
‘బయో మాయ’ కథనంపై అధికారులు స్పందించారు. గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్, వ్యవసాయ శాఖ జేడీ విజయభారతితో పాటు, ఏడీఏలు సమావేశమయ్యారు. నకిలీ బయోఉత్పత్తుల తయారీదారులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఐదు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటుచేసి ఎఫ్‌సీఓ యాక్ట్‌ అమలయ్యేలా చూడాలని చెప్పారు. కంపెనీ ప్రతినిధులు, డీలర్ల అసోసియేషన్‌లతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఎఫ్‌సీఓ యాక్ట్‌పై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను కోరారు. వెంటనే డీలర్ల వద్ద ఉన్న నకిలీ బయోలను ఉత్పత్తిదారులకు తిప్పి పంపేలా నోటీసులు జారీ చేయాలన్నారు. నకిలీ బయో ఉత్పత్తులు అమ్మితే ఎఫ్‌సీఓ యాక్ట్‌ 1985 (ఫెర్టిలైజర్‌ కంట్రోల్‌ ఆర్డర్‌) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ అధికారులు ఏడీఏ హేమలత ఆధ్వర్యంలో గుంటూరు పట్నంబజారులో పురుగు మందుల షాపుల్లో తనిఖీలు చేశారు. విశ్వనాథ ట్రేడర్స్‌ లైసెన్సు పదిరోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేశారు. సదరు షాపులోని ఉత్పత్తుల నమూనాలను పరీక్షలకు తిరుపతిలోని రీజనల్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు పంపినట్టు అధికారులు చెప్పారు. 

చట్టం కచ్చితంగా అమలు
ఇప్పటివరకు జీవో నంబర్‌ ఎస్‌18, హైకోర్టు ఆదేశాల ప్రకారం బయో ప్రొడక్ట్స్‌ వ్యాపారం జరుగుతున్నట్టు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఎస్‌వో నంబర్‌ 882 (ఇ) ప్రకారం బయో ప్రొడక్ట్స్‌ అన్నింటినీ స్టిమ్యులెన్స్‌గా పేర్కొని.. అన్ని ప్రొడక్ట్స్‌ను ఫెర్టిలైజర్‌ (కంట్రోల్‌) ఆర్డర్‌–1985 పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. బయో స్టిమ్యులెంట్స్‌ వ్యాపారం చేయదలచిన డీలర్లందరూ ఆ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని జేడీ తెలిపారు.  

మరిన్ని వార్తలు