కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలి

30 Aug, 2021 05:32 IST|Sakshi
సంఘీభావం తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ సత్యనారాయణ, తదితరులు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భూములతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారానికే పెట్టుబడిదారుల ఆసక్తి

మానవహారం ముగింపు కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

అగనంపూడి(గాజువాక)/ఉక్కునగరం(గాజువాక): ఆంధ్రుల మనోభావాలను లెక్క చేయకుండా కేంద్రం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో ముందుకు వెళ్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ  సారధ్యంలో అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు జరిగిన పది కిలోమీటర్ల మానవహారం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానవహారానికి పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులు అందరూ కదిలి వచ్చారని.. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాల్సిన అవసరం ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ఎవరు కొనుగోలు చేసినా వాళ్లు విశాఖ రాలేరని.. వచ్చినా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.

విశాఖ ఉక్కు పేరుతో ఉన్న 21 ఎకరాల భూమిలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికే పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి కర్మాగారం వెళ్తే.. ప్లాంట్‌ భూములతో వ్యాపారం చేసి ఉడాయిస్తారన్నారు. ప్లాంట్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వేలాది కుటుంబాల పరిస్థితిపై రాష్ట్ర ప్రజలు ఆందోళనతో ఉన్నారని చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షాల సారధ్యంలో ఐక్య పోరాటాలు సాగిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌సీపీతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు తెలిపారన్నారు.

ఈ విషయంలో ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌కు తమ నిరసన గళం వినిపించామన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఇప్పటికే ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం వైఎస్‌ జగన్‌ పలుమార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు, మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ముందుకు వెళ్తే అడ్డుకుంటామని చెప్పారు. పోరాట కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ నరసింగరావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా తీర్చిదిద్దడానికి అఖిలపక్షాలతో సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కాగా స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటం సోమవారానికి 200వ రోజుకు చేరుకుంటోంది. కేంద్రం ప్రకటనను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న కూర్మన్నపాలెం కూడలి వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆ««ధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. 

మరిన్ని వార్తలు