APTWREIS: ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

29 Apr, 2022 09:37 IST|Sakshi

సాక్షి, పాడేరు: కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ప్రవేశాలకు గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణ తెలిపారు. సీబీఎస్‌ఈ ఇంగ్లీష్‌ మీడియంలో బాలబాలికలకు కో ఎడ్యుకేషన్‌ పద్ధతితో విద్యాబోధన ఉంటుందని ఆయన వివరించారు. ప్రతి తరగతికి 60 సీట్లు చొప్పున బాలికలకు 30, బాలురకు 30 కేటాయిస్తున్నామని ఆయన వివరించారు.

2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి జి.కె.వీధి, డుంబ్రిగుడ(అరకు సంతబయలు), చింతపల్లి, ముంచంగిపుట్టు(పెదబయలు), అనంతగిరి, అరకులోయ, హుకుంపేట(పాడేరు), పెదబయలు, పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరులోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ప్రవేశాలు కోరుతున్నామన్నారు. 6వ తరగతిలో ప్రవేశాలకు గాను 5వ తరగతి పాసైన విద్యార్థిని, విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు.

కొయ్యూరులో 7వ తరగతిలో బాలురకు మూడు సీట్లు, బాలికలకు మూడు సీట్లు ఖాళీలున్నాయని, పాడేరులో 7వ తరగతిలో బాలురకు ఆరు సీట్లు ఖాళీలున్నాయన్నారు. దరఖాస్తు, ఇతర వివరాలకు www.aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. మే 16వ తేదీలోపు 6,7తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని, మే 21వ తేదీన ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. దరఖాస్తుల సమర్పణకు దగ్గరలోని గురుకుల పాఠశాల/కళాశాలలో సంప్రదించాలని ఆయన కోరారు.  

ప్రతిభ పాఠశాలల్లో ప్రవేశాలకు.. 
ప్రభుత్వ ఆదేశాల మేరకు 2022–23 విద్యాసంవత్సరానికి గాను ప్రతిభ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రతిభ విద్యాలయాల్లో నాణ్యమైన విద్య, ఇతర సౌకర్యాలను అమలు చేస్తుందన్నారు. విశాఖలోని మారికవలస ప్రతిభ పాఠశాలలో 8వ తరగతిలో బాలికలకు 45 సీట్లు, విజయనగరం జిల్లా జోగంపేట ప్రతిభ పాఠశాలలో 8వ తరగతి(బాలురు)కు 45సీట్లు కేటాయించారన్నారు. అలాగే ప్రతిభా కళాశాలల్లో సీవోఈ, ఎస్‌వోఈ విభాగాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాలకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఆయన వివరించారు.

మారికవలసలో బాలికలు, జోగంపేటలో బాలురు ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని, కేవలం గిరిజన బాలబాలికలు మాత్రమే అర్హులన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని ఆయన వివరించారు. 8వ తరగతి ప్రవేశాలకు గాను ప్రభుత్వం, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 7వ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. అర్హులైన బాలబాలికలు వచ్చేనెల 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రవేశపరీక్షను పాడేరు గురుకుల పాఠశాల, అరకులోయ గురుకుల కళాశాలల్లో మే 29న నిర్వహిస్తామని పీవో వెల్లడించారు.   

(చదవండి: మే నెలాఖరుకు 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: ఆదిమూలపు సురేశ్‌)

మరిన్ని వార్తలు