రహదార్ల విస్తరణలో ఎన్జీవోల భాగస్వామ్యం

8 Dec, 2020 04:56 IST|Sakshi

వైజాగ్‌–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధిలో భాగంగా భూసేకరణ, పునరావాస కార్యాచరణ ప్రణాళికకు సాయం

చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 37 కి.మీ. మేర అభివృద్ధి

ఎన్జీవోలే కన్సల్టెంట్లుగా వ్యవహరించేందుకు టెండర్లు

ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించిన ఏపీఆర్‌డీసీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదార్ల విస్తరణ, అభివృద్ధిలో ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోలు) ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. భూసేకరణ, పునరావాస కార్యాచరణ ప్రణాళికల్లో రైతులు, ప్రజలను ఒప్పించడంలో వీరు కీలకపాత్ర పోషించనున్నారు. ఈ మేరకు చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 37 కిలోమీటర్ల మేర రహదార్లను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఆర్‌డీసీ) తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. రహదారి ప్రాజెక్టులకు కన్సల్టెంట్లుగా వ్యవహరించేందుకు ఎన్జీవోలను టెండర్ల ద్వారా ఎంపిక చేయనుంది. టెండర్ల దాఖలుకు ఈ నెల 25 తుది గడువుగా పేర్కొంది. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) రుణసాయంతో ప్రభుత్వం విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయనుంది.

ఇందులో భాగంగా పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్లు, పట్టణ ముఖ్య కేంద్రాలను కలుపుతూ రహదార్ల విస్తరణ పనులు చేపట్టింది. ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రైతుల వద్ద భూములు సేకరించాలి. అంతేకాకుండా మెరుగైన పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలు (ఆర్‌ అండ్‌ ఆర్‌) చేపట్టాలి. ఈ నేపథ్యంలో రైతులను ఒప్పించడానికి ఎన్జీవోలను ఎంపిక చేయాలని ఏడీబీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. విదేశీ రుణ సాయంతో పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయనుండటంతో ఏడీబీ సూచనలను పరిగణనలోకి తీసుకుని ఎన్జీవోల ఎంపికకు సర్కార్‌ టెండర్లు పిలిచింది. ఇందులో భాగంగా తొలుత ఎన్జీవోల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించింది. 

ఎన్జీవోలు ఏం చేయాలంటే..
► టెండర్ల ద్వారా ఎంపికైన ఎన్జీవోలు రహదార్ల విస్తరణకు అవసరమైన భూసేకరణపై రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.
► ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి ఆర్‌ అండ్‌ ఆర్‌ కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
► స్థానిక ప్రజలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి జరిగే అభివృద్ధిపై ప్రచారం చేయాలి.
► రహదారి భద్రతపై అవగాహన కల్పించాలి. 

>
మరిన్ని వార్తలు