రూ.30 కోట్ల జరిమానా ఎగ్గొట్టిన టీడీపీ నేత

13 Jun, 2021 02:48 IST|Sakshi

మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి బాగోతం

18 క్వారీల్లో అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఖజానాకు గండి

అన్ని క్వారీలను బంద్‌ చేయించిన అధికారులు

మడకశిర: అధికారాన్ని అడ్డు పెట్టుకుని క్వారీల నిర్వహణతో అనంతపురం జిల్లాలో టీడీపీ ఏపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సాగించిన అక్రమాలు వెలుగు చూశాయి. నిబంధనలకు వ్యతిరేకంగా 18 క్వారీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున గ్రానైట్, రోడ్డు మెటల్‌ తరలించి, ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా రాయల్టీ చెల్లించక పోవడాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్‌గా పరిగణించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) బాలాజీ నాయక్‌ తదితరులు.. విస్తృత తనిఖీలు చేపట్టి, అక్రమాలపై నిగ్గు తేల్చారు.

18 క్వారీలను బంద్‌ చేయించారు. ఈ క్వారీల నిర్వహణలో పరిమితికి మించి గ్రానైట్, రోడ్డు మెటల్‌ తరలిస్తుండడంతో గతంలోనే రూ.30 కోట్ల మేర  అధికారులు జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో క్వారీలను బంద్‌ చేయించినట్లు శనివారం గనుల శాఖ ఏడీ ధ్రువీకరించారు. కాగా, యూ.రంగాపురం వద్ద ఉన్న మెటల్‌ క్వారీకి విద్యుత్‌ సరఫరాను సైతం నిలిపి వేయాలంటూ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీతో పాటు ఎస్‌ఈకి లేఖ రాసినట్లు తెలిపారు. క్వారీల్లో అక్రమ మైనింగ్‌ జరపకుండా గట్టి నిఘా ఉంచామని ఆయన వివరించారు.   

మరిన్ని వార్తలు