అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్‌’ 

16 May, 2021 08:04 IST|Sakshi
సీటీ స్కాన్‌ యంత్రం- దగ్గు నివారణకు అవసరం లేకున్నా నరేష్‌కు డాక్టర్‌ రాసిచ్చిన మందులు ఇవే..

కరోనా కష్టకాలంలో అడ్డగోలు దోపిడీ 

అవసరం లేకున్నా స్కానింగ్‌లు

కమీషన్ల కక్కుర్తిలో ప్రైవేట్‌ డాక్టర్లు 

పరిగి మండలానికి చెందిన నరేష్‌ కొన్ని వారాల క్రితం కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. మూడు రోజుల తర్వాత స్వల్పంగా దగ్గు మొదలైంది. ఎందుకైనా మంచిదని హిందూపురం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకున్నారు. చికిత్స కోసం వచ్చిన అతన్ని కనీసం తలెత్తి కూడా చూడని ఆ డాక్టర్‌.. నరేష్‌ చెబుతున్న జబ్బు లక్షణాలు పూర్తి కాకనే ఓ రెఫరల్‌ ప్రిస్కిప్షన్‌ చేతిలో పెట్టేశాడు. చెస్ట్‌ ఎక్స్‌రే, సీటీ స్కాన్, బ్లడ్‌ చెకప్‌ చేయించాలని రాసి ఉంది.

అదే ఆస్పత్రిలోని డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ను కలిసి బ్లడ్‌ చెకప్‌కు సంబంధించి నమూనాలు ఇచ్చి, రూ.900 బిల్లు చెల్లించాడు. డాక్టర్‌ సూచించిన ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్‌కు వెళ్లి ఎక్స్‌రే కోసం రూ.350, సీటీ స్కాన్‌ కోసం రూ.3వేలు బిల్లు చెల్లించుకున్నాడు.  ఈ మొత్తం రిపోర్టులు పరిశీలించిన తర్వాత నరేష్‌కు కరోనా సోకిందంటూ నెమ్మదిగా చెప్పిన డాక్టర్‌.. తనకు అనుబంధంగా ఉన్న మెడికల్‌ షాప్‌ ద్వారా రూ.800 విలువ చేసే మందులు కొనుగోలు చేయించాడు.

దగ్గు కోసం చికిత్సకు వెళితే.. కేవలం రెండు గంటల వ్యవధిలో డాక్టర్‌ కన్సల్టింగ్‌ ఫీజుతో కలిపి రూ.4,350 వరకు నరేష్‌ చెల్లించుకోవాల్సి వచ్చింది. తనలో ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో ఎందుకైనా మంచిదని అదే రోజు తనకు తెలిసిన ఊపిరితిత్తులకు సంబంధించిన మరో ప్రైవేట్‌ వైద్యుడిని కలిశాడు. అతన్ని పూర్తిస్థాయిలో పరీక్షించిన అనంతరం కరోనా లేదని, ఇన్‌ఫెక్షన్‌ సోకడం వల్ల దగ్గు వస్తోందంటూ తేల్చి ఓ టానిక్, కొన్ని మందులు రాసిచ్చాడు. ఇక్కడ ఆస్పత్రి కన్సల్టెంగ్‌ ఫీజు, నెబులైజర్, మందులకు 1,300 ఖర్చయింది. ఇంటికెళ్లి ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్‌ రాసిచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడడంతో ఓ రెండు రోజుల తర్వాత నరేష్‌ పూర్తిగా కోలుకున్నాడు. ఈ పరిస్థితి కేవలం నరేష్‌ ఒక్కనిదే కాదు. సాధారణ జబ్బులతో చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రుల చుట్టూ తిరుతున్న వారందరూ ఈ తరహా దోపిడీకి గురవుతున్నారు.   

హిందూపురం టౌన్‌: ఆస్పత్రికి వచ్చే వారిని కచ్చితంగా సీటీ స్కానింగ్‌ చేయించుకోవాలని ప్రైవేట్‌ వైద్యులు జులుం చేస్తున్నారు. ఇలా హిందూపురం ప్రాంతంలోని చాలా ఆస్పత్రుల్లో సీటీ స్కాన్‌ పేరిట పెద్ద ఎత్తున స్కామ్‌కు తెరలేపారు. కరోనా కష్టకాలంలో రోగుల్లోని భయాన్ని కొందరు డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారంగా మార్చేశారు. స్వల్పంగా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే చాలు.. అవసరం లేకున్నా వైద్య పరీక్షలు అంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది.

రోజుకు సగటున 70కి పైగా.. 
హిందూపురం జిల్లా ఆస్పత్రితో పాటు మరో మూడు ప్రైవేట్‌ సీటీ స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయి. ఇందులో జిల్లా ఆస్పత్రిలోని సీటీ స్కానింగ్‌ యంత్రం పనిచేయడం లేదు. ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లలోనూ ఒకటి పనిచేయడం లేదు. దీంతో పనిచేస్తున్న రెండు స్కానింగ్‌ సెంటర్లకు కరోనా కష్ట కాలంలో భారీ డిమాండ్‌ నెలకొంది. గతంలో సీటీ స్కాన్‌కు రోగి అవసరాన్ని బట్టి రూ.4 వేలు నుంచి రూ.5వేల వరకూ స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు వసూలు చేసుకునేవారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ తీసుకుంటున్నారు. ఈ లెక్కన హిందూపురంలోని స్కానింగ్‌ సెంటర్లలో రోజుకు 70 నుంచి 140 వరకు సీటీ స్కాన్‌లు నిర్వహిస్తుంటారు. జిల్లాస్పత్రిలో సీటీ స్కాన్‌ పనిచేయకపోవడంతో అవసరాన్ని బట్టి ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లకు రెఫర్‌ చేస్తుంటారు.

రెఫరల్‌కు రూ.800 కమీషన్‌ 
హిందూపురం నియోజకవర్గంతో పాటు పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల ప్రజలు అత్యవసర చికిత్సల కోసం హిందూపురంలోని ఆస్పత్రులనే ఆశ్రయిస్తుంటారు. కరోనా భయంతో కుదేలవుతున్న రోగులకు అవసరం లేకున్నా సీటీ స్కాన్‌లు నిర్వహిస్తూ ఆర్‌ఎంపీలు, ప్రైవేట్‌ డాక్టర్లు తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. తమ వద్దకు చికిత్స కోసం వచ్చిన రోగులకు అవసరం లేకున్నా.. ముందుగా సీటీ స్కాన్‌లు, బ్లడ్‌ చెకప్‌లు, ఎక్స్‌రేలకు డాక్టర్లు రెఫర్‌ చేస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్యకూ సీటీ స్కాన్‌ తప్పనిసరి చేసేశారు. సీటీ స్కానింగ్‌కు రెఫర్‌ చేసిన డాక్టర్‌కు ఒక్కో స్కాన్‌కు రూ.800 చొప్పున కమీషన్‌ను స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు అందజేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇతర వైద్య పరీక్షల్లోనూ కమీషన్లను డాక్టర్లు దండుకుంటున్నారు. చివరకు మందుల కొనుగోలు విషయంలోనూ కమీషన్లు ఉండడంతో ప్రి్రస్కిప్షన్‌ చాలా పొడవుగా ఉంటోంది.

సీటీ స్కాన్‌తో అన్నీ సమస్యలే..  
అవసరం లేకున్నా సీటీ స్కాన్‌ చేయించడం చాలా ముప్పు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందంటున్నారు. కొంతమంది వైద్యులు ప్రతి మూడు రోజులకు ఒకసారి సీటీ స్కాన్‌ చేయిస్తుంటారని, దీంతో రోగి శరీరం అధిక రేడియేషన్‌కు గురికావడంతో క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదముంటుందని స్పష్టం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు మాత్రం అదీ వైద్యులు సూచిస్తేనే సీటీ స్కాన్‌ చేయించుకోవాలని చెబుతున్నారు.

సీటీ స్కాన్‌ కంటే చెస్ట్‌ ఎక్స్‌రేకే తొలి ప్రాధాన్యమివ్వాలని.. అప్పటికీ జబ్బు పరిస్థితి తేలకపోతే సీటీ స్కాన్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. ఒక సీటీ స్కాన్‌ 300 నుంచి 400 చెస్ట్‌ ఎక్స్‌రేలతో సమానమని హెచ్చరిస్తున్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడే వారికి సీటీ స్కాన్‌ అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. స్వల్ప కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారు, ఆక్సిజన్‌ లెవల్స్‌ సాధారణంగా ఉన్న వారికి సీటీ స్కాన్‌ అసలు అవసరం లేదని అంటున్నారు.

తుంగలోకి కోవిడ్‌ నిబంధనలు 
కరోనా నిర్ధారణకు ఆర్‌ఎంపీలు, ప్రైవేట్‌ వైద్యులు సీటీ స్కాన్‌పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. దీంతో ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. ఈ డిమాండ్‌ను అనుకూలంగా మార్చుకున్న స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు కోవిడ్‌ నిబంధనలు తుంగలో తొక్కేశారు. డాక్టర్లు రాసిచ్చిన రెఫరల్‌ ప్రి్రస్కిప్షన్‌ను మళ్లీ రోగి చేతికి ఏ ఒక్క స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు ఇవ్వడం లేదు. కేవలం రిపోర్టులు మాత్రమే చేతిలో పెట్టేసి డబ్బు గుంజుతున్నారు. దీనికి తోడు ఒకరికి స్కాన్‌ చేసిన తర్వాత యంత్రాన్ని పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేయడం లేదు.

దీంతో తొలుత స్కాన్‌ చేసిన రోగికి కరోనా పాజిటివ్‌ ఉంటే.. తర్వాత స్కాన్‌ చేసిన రోగికి లేకపోయినా.. అతను కరోనా బారిన పడే ప్రమాదం లేకపోలేదు. అయితే నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డాక్టర్‌ రెఫరల్‌ ప్రిస్కిప్షన్‌ లేకపోయినా.. సొంత నిర్ణయాలతో సీటీ స్కాన్‌లు చేసేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

డాక్టర్‌ సిఫారసు లేకుండా చేయరాదు  
అవసరం లేకున్నా స్కాన్‌కు రెఫర్‌ చేయడం సరికాదు. క్వాలిఫైడ్‌ డాక్టర్ల సిఫారసు లేకుండా సీటీ స్కాన్‌ చేస్తే స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. రోగులు సైతం డాక్టర్ల సలహా మేరకే స్కానింగ్‌ చేయించుకోవాలి. వ్యక్తిగత నిర్ణయాలు చాలా నష్టం కలిగిస్తాయి. 
– డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

చదవండి: ప్రాణ వాయువుకు ఫుల్‌‘పవర్‌’  
నిరంతరాయంగా స్టీల్‌ప్లాంట్‌ ఆక్సిజన్‌

>
మరిన్ని వార్తలు