'కృష్ణా'పై ఇదేం కిరికిరి?

29 Apr, 2022 04:31 IST|Sakshi

రెండు రాష్ట్రాలకు చెరి సగం పంచాలని బోర్డుకు తెలంగాణ మళ్లీ లేఖ

ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించిన బచావత్‌ ట్రిబ్యునల్‌ 

ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయిస్తూ కేంద్రం తాత్కాలిక సర్దుబాటు

శ్రీశైలం, సాగర్‌లలో 66:34 నిష్పత్తిలో పంపిణీకి ఏపీ, తెలంగాణ ఆమోదం

బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడే వరకూ అదే విధానానికి అంగీకారం

దాన్ని ఉల్లంఘించి చెరి సగం పంచాలంటూ పదేపదే తెలంగాణ పేచీ

సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కారు తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాయడాన్ని నీటిపారుదల రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015 జూన్‌ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీనికి అంగీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంతకం కూడా చేసింది. 2017–18 నీటి సంవత్సరంలో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఆవిరి నష్టాలు పోనూ లభ్యతగా ఉన్న నీటిని 66 : 34 చొప్పున పంపిణీ చేసుకునేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడే వరకూ ఇదే పద్ధతిలో నీటిని పంచుకోవాలని నిర్ణయించడంతో  2018–19, 2019–20, 2020–21, 2021–22లలో అదే విధానం ప్రకారం నీటిని కృష్ణా బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. 

పదే పదే పేచీ..
తెలంగాణ సర్కార్‌ 2015, 2017–18లలో కుదిరిన ఒప్పందాలను తుంగలో తొక్కుతూ ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల పంపిణీపై పదేపదే పేచీకి దిగుతోంది. రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్‌ లేఖ రాయడంతో మే 6న నిర్వహించే బోర్డు సర్వ సభ్య సమావేశంలో చర్చించాలని బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ నిర్ణయించి అజెండాలో చేర్చారు.

చెరి సగం అసాధ్యం..
కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు, పునరుత్పత్తి 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఏపీకి 811 టీఎంసీలను కేటాయించింది. మిగులు జలాలను హక్కుగా కాకుండా వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి ఇచ్చింది.

► ఉమ్మడి రాష్ట్రానికి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల్లో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీల వాటా కల్పించింది. నిర్మాణం, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది.
► ఆ కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక ఏర్పాటు చేసింది.
► బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం కాబట్టే బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ వాటిని కొనసాగించింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే చెరి సగం వాటా కావాలని తెలంగాణ సర్కార్‌ లేఖ రాయడం చట్టవిరుద్ధమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు