పరిపాలనలో కొత్త ఒరవడి ఆరంభం : మేకపాటి

5 Aug, 2020 12:50 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఐఎస్‌బీ ఒప్పందం కుదుర్చుకోవడంతో పరిపాలనలో కొత్త ఒరవడి ప్రారంభమైందని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మేకపాటి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఐఎస్‌బీ ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ జ‌రిగిందన్నారు.ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా 'ఆంధ్రప్రదేశ్ తో - ఐఎస్ బీ' ఒప్పందంజరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సమగ్రాభివృద్ధి దిశగా 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఐఎస్ బీ పబ్లిక్ పాలసీ ల్యాబ్'కు శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు. ఐఎస్‌బీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో కీలక సమస్యలకూ వెంటనే పరిష్కారం ల‌భించ‌నుంద‌ని తెలిపారు. (ఐఎస్‌బీ ఒప్పందం దేశంలోనే తొలిసారి: గౌత‌మ్ రెడ్డి)

విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలను తీసుకురావడం, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఐఎస్‌బీ కీల‌క‌పాత్ర పోషించ‌నుంద‌ని పేర్కొన్నారు.  భవిష్యత్ లో వెనుకబడిన ప్రాంతాలే లేని సమానాభివృద్ధికై సీఎం తపిస్తున్నారన్నారు. ఆర్థిక, పారిశ్రామిక, నైపుణ్య, ఐటీ, ఉపాది రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అధ్యయనం, విజ్ఞానం, విశ్లేషణ, పరిశోధన, ప్రణాళిక, వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకెళతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం దేశంలోనే తొలిసారని గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థికవనరుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు. సత్వరమే కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు మేకపాటి వెల్లడించారు.

మరిన్ని వార్తలు