AP: మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి ఐఎస్‌ఓ గుర్తింపు 

18 Mar, 2022 07:51 IST|Sakshi

అత్యుత్తమ సేవలకు విశిష్ట పురస్కారం

నాణ్యతాప్రమాణాలు, సిబ్బంది పనితీరుకు ప్రశంసలు 

పులిచెర్ల(కల్లూరు)/చిత్తూరు జిల్లా: వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలబడాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించింది. సాగుకు సరైన సమయంలో సాయం అందించాలని ఆర్‌బీకే సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. అన్నదాతలకు అవసరమైన ఎరువులు, పురుగు మందులను సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించింది. రైతాంగానికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తలలో నాలుకగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సర్కారు ఆశయాలను మతుకువారిపల్లె రైతు భరోసా కేంద్రం అందిపుచ్చుకుంది. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విశేష సేవలందిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచి ఐఎస్‌ఓ గుర్తింపు సాధించింది.

చదవండి: ఇంత చీప్‌ ట్రిక్స్‌ ఎందుకు బాబూ?  

మండలంలోని మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి విశిష్ట గుర్తింపు లభించింది. ఇక్కడ అమలు చేస్తున్న విధానాలు, రైతులకు అందిస్తున్న సేవలకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ దక్కింది. అన్నదాతలకు అవసరమైన సలహాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహార మందుల పంపిణీ, పండించిన పంటల మార్కెటింగ్, అత్యుత్తమ నాణ్యతా సౌకర్యాలు భవనం తదితరాలను ఐఎస్‌ఓ ప్రామాణికంగా తీసుకుంది. విశిష్ట పురస్కారం సాధించిన మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రం సిబ్బందిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. 

సేవలు.. సౌకర్యాలు 
మతుకువారిపల్లెలో 1,180 మంది రైతులు ఉన్నారు. సుమారు 715 హెక్టార్ల భూమి సాగులో ఉంది. గ్రామంలో అధికంగా మామిడి, మిరప, చెరుకు, వరి, టమాట పంటలను సాగు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం 2020 మే 30వ తేదీన మతుకువారిపల్లెలో రైతు భరోసా కేంద్రం ప్రారంభించింది. దీని పరిధిలో మూడు పంచాయతీలను చేర్చింది. ఈ ఆర్‌బీకే భవనంలో డిజిటల్‌ లైబ్రరీ, వ్యవసాయ సంబంధిత పుస్తకాలు, టీవీ అందుబాటులో ఉంచింది. దీనికితోడు ఆర్‌బీకేలో విధులు నిర్వర్తిస్తున్న వ్యవసాయ అసిస్టెంటు, వెటర్నరీ అసిస్టెంటు రైతులకు చిత్తశుద్ధితో సేవలందించారు.

ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలను పొలాల సందర్శనకు తీసుకువచ్చి రైతులకు సలహాలు అందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం పథకాలను పారదర్శంగా అర్హులందరికీ పంపిణీ చేస్తున్నారు.  ముఖ్యంగా రైతుభరోసా సొమ్ము అన్నదాతలకు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ–క్రాప్‌ నమోదు చేసి పంటకు రక్షణ కల్పిస్తున్నారు. భూసార పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించి ఏ సమయంలో ఏయే పంటలు సాగు చేయాలనే విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 

తగ్గిన వ్యయం.. పెరిగిన దిగుబడి 
మతుకువారిపల్లె రైతులు గతంలో ఎరువుల కోసం  పీలేరు, సదుం, కల్లూరుకు వెళ్లేవారు. ఇందుకోసం అదనంగా ఒక్కో రైతుకు రూ.200 నుంచి రూ.500 వరకు ఖర్చయ్యేది. అయితే రైతుభరోసా కేంద్రంలోనే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందుబాటులోకి రావడంతో అదనపు వ్యయం తప్పింది. కియోస్క్‌ మిషన్‌ ద్వారా ఎరువులు, మందుల వివరాలతోపాటు మార్కెట్‌ ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు లభించింది.  ఆర్‌బీకే సిబ్బంది పనితీరు కారణంగా గ్రామంలోని రైతులు మంచి ఫలితాలను సాధించారు. ఆధునిక పనిముట్ల వినియోగంతో అధిక దిగుబడి పొందుతున్నారు. వ్యవసాయానికి అండగా నిలిచి, అన్నదాతల ఆరి్ధకాభివృద్ధికి సహకరిస్తూ, అత్యుత్తమ సేవలందిస్తున్న మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రాన్ని ఐఎస్‌ఓ ప్రశంసించింది. ఉత్తమ సరి్టఫికెట్‌ను ప్రదానం చేసింది. సిబ్బంది కృషిని అభినందించింది.

సకాలంలో ఎరువులు 
వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత మాకు సకాలంలో ఎరువులు అందుతున్నాయి. బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు మా పొలాలను సందర్శించి సలహాలు అందిస్తున్నారు. మా ఆర్‌బీకే ఇప్పుడు ఐఎస్‌ఓ గుర్తింపు సాధించడం ఆనందంగా ఉంది.  
– సి.రాణి, రైతు, మతుకువారిపల్లె 

జగనన్నకు కృతజ్ఞతలు 
రైతుభరోసా కేంద్రాల ద్వారా మాకు ఇన్ని సేవలందిస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు.  ఆర్‌బీకే సిబ్బంది మాకు ఎప్పడూ అందుబాటులో ఉంటారు. ఒక పర్యాయం రైతుభరోసా సొమ్ము రాకపోతే వెంటనే ఆధార్‌ అనుసంధానం చేయించి నగదు అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పెట్టుబడి కోసం అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆధునిక పనిముట్ల వినియోగంపై మాకు అవగాహన కల్పించారు.  
– పి.తాతప్ప, రైతు, బోడిరెడ్డిగారిపల్లె 

ఆనందంగా ఉంది 
మా రైతుభరోసా కేంద్రానికి ఐఎస్‌ఓ సరి్టఫికెట్‌ రావడం ఆనందంగా ఉంది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మేం పనిచేశాం. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన బాటలో నడిచాం. అన్నదాత ఎప్పుడూ నష్టపోకూడదు అనే సంకల్పంతో విధులు నిర్వర్తించాం. ఆర్‌బీకే ద్వారా సకాలంలో సేవలందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. మా కష్టానికి గుర్తింపు లభించినట్లు భావిస్తున్నాం.  
–రోహిణి, వ్యవసాయ అసిస్టెంట్, మతుకువారిపల్లె ఆర్‌బీకే 

మరిన్ని వార్తలు