‘భారత్‌ దర్శన్‌’ ప్యాకేజీ రైళ్లకు ఐసొలేషన్‌ కోచ్‌లు

22 Nov, 2020 03:33 IST|Sakshi

కోవిడ్‌ లక్షణాల రోగులకు ప్రత్యేక సదుపాయం 

డిసెంబర్‌ 12 నుంచి దక్షిణ భారత యాత్ర  

సాక్షి, అమరావతి: దక్షిణ భారత యాత్ర పేరిట రైల్వే శాఖ ‘భారత్‌ దర్శన్‌’ రైళ్లను నడపనుంది. కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్‌ 12 నుంచి ఈ రైళ్లను నడిపేందుకు ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) సన్నద్ధమవుతోంది. మొత్తం నాలుగు రైళ్లను విశాఖపట్నం, సికింద్రాబాద్, భువనేశ్వర్‌ల నుంచి ప్రారంభించనున్నారు. భారత్‌ దర్శన్‌ యాత్ర ఏడు నుంచి పది రోజుల వరకు ఉండటంతో కోవిడ్‌ లక్షణాలతో బాధపడే వారి కోసం ఐసొలేషన్‌ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో క్వారంటైన్‌ సదుపాయాలను కల్పించారు. భారత్‌ దర్శన్‌ రైళ్లకు స్లీపర్‌తో పాటు ఏసీ త్రీ టైర్‌ కోచ్‌లను అందుబాటులో ఉంచారు. స్లీపర్‌ కోచ్‌లు ఐసొలేషన్‌ కోచ్‌లుగా మార్చేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. ఐఆర్‌సీటీసీ ఇప్పటికే రెండు రకాల ప్యాకేజీలను ప్రకటించింది. రూ.7,140 (స్లీపర్‌ కోచ్‌లు), రూ.8,610 (ఏసీ కోచ్‌లు) చార్జీలుగా ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది.  

5 వేల కోవిడ్‌ కేర్‌ కోచ్‌లు తయారీ 
► కోవిడ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో భారత రైల్వే 5 వేల కోవిడ్‌ కేర్‌ కోచ్‌లు రూపొందించింది.  
► భారత్‌ దర్శన్‌ మొదటి రైలు డిసెంబర్‌ 12న సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమవుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లకు చేరుతుంది. 
► రెండో రైలు జనవరి 2న భువనేశ్వర్‌ నుంచి మొదలై బరంపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ స్టేషన్లకు చేరుతుంది. దక్షిణ భారత దేవాలయాల టూర్‌గా ఈ రైలును నడపుతారు. 
► ఈ రైళ్లలో దక్షిణ భారత యాత్ర చేయాలనుకుంటే 48–72 గంటల ముందు పరీక్ష చేయించుకుని పీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది.   

>
మరిన్ని వార్తలు