అంతరిక్ష కేంద్రానికి ఆహ్వానం.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

8 Apr, 2022 16:23 IST|Sakshi
రాకెట్‌ నమూనాను పరిశీలిస్తున్న కంచరాం విద్యార్థులు

యువ శాస్త్రవేత్తల కోసం ఇస్రో పిలుపు

9వ తరగతి విద్యార్థులు అర్హులు  

ఈ నెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం 

రాజాం సిటీ: యువ శాస్త్రవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కృషిచేస్తోంది. ఇందులో భాగంగా యువికా–2022 (యువ విజ్ఞాన కార్యక్రమం) యువ శాస్త్రవేత్తలను తయారుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యాసంవత్సరంలో దేశవ్యాప్తంగా 9వ తరగతి చదివే విద్యార్థుల నుంచి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణల వైపు యువతను నడిపించడం, అంతరిక్షంపై మక్కువ పెంచుకోవడం కోసం రాబోయే తరాల్లో శాస్త్రవేత్తలను గుర్తించే దిశగా ఇస్రో దృష్టి సారించి  దేశవ్యాప్తంగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆహ్వానిస్తోంది.   డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్‌ఆర్‌ఓ.జీఓవీ.ఐఎన్‌లలో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది.   

దరఖాస్తు చేయండిలా.. 
విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రతిదశలో జాగ్రత్తగా వివరాలు నమోదుచేయాలి. అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరిస్తారు.యువికా–2022 కోసం ఏర్పాటుచేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్‌ఆర్‌ఓ.జీఓవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో విద్యార్థులు సొంత ఈ–మెయిల్‌ ఐడీతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. క్విజ్‌ సూచనలు చదివి ఈ–మెయిల్‌ క్రియేట్‌ చేసిన 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. 

క్విజ్‌ అప్‌లోడ్‌ చేసిన 60 నిమిషాల తరువాత యువికా పోర్టల్‌లోని ఆన్‌లైన్‌ దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదుచేయాలి. అనంతరం డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతిని, విద్యార్థి మూడేళ్లలో వివిధ అంశాల్లో రూపొందించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. 

ఇందులో ఎంపికైన వారిని ఇస్రో వడబోసి తుదిజాబితా అదే నెల 20న వెబ్‌సైట్‌లో ఉంచుతుంది.  

రాష్ట్రానికి ముగ్గురు విద్యార్థులు చొప్పున అవకాశం కల్పిస్తారు. 

ఎంపికైన విద్యార్థులకు విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌ (తిరువనంతపురం), యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ (బెంగళూరు), స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (అహ్మదాబాద్‌), నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (హైదరాబాద్‌), నార్త్‌ ఈస్ట్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (షిల్లాంగ్‌)లలో మే 16 నుంచి 28 వరకు 13 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. 

అర్హులు వీరే.... 
ఈ ఏడాది మార్చి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వారికి ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కులతోపాటు గత మూడు సంవత్సరాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొని ఉండాలి. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్‌లలో సభ్యుడై ఉండాలి. 

మరిన్ని వార్తలు