పట్టాలెక్కని రైల్వే జోన్‌

27 Feb, 2021 05:14 IST|Sakshi

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రకటించి నేటికి రెండేళ్లు

ఇంకా డీపీఆర్‌ దశలోనే ఉందన్న రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌

జోన్‌ ఏర్పాటుకు రూ.169 కోట్లు అవసరం కాగా.. కేటాయించింది రూ.3.40 కోట్లే

సాక్షి, అమరావతి: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటించి శనివారం నాటికి రెండేళ్లు పూర్తయింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలిపి ‘సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌’గా విశాఖ జోన్‌ను 2019 ఫిబ్రవరి 27న కేంద్రం ప్రకటించింది. అయితే, వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని విజయవాడలో కలిపారు. మరో భాగాన్ని రాయగఢ్‌ డివిజన్‌గా పేరు మార్చారు. రాయగఢ్‌ డివిజన్‌ ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌లో ఉంటుంది. గతంలో వాల్తేరు డివిజన్‌ మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉండేది. గతంలో చంద్రబాబు హయాంలోనే వాల్తేరు డివిజన్‌ను ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌లో విలీనం చేశారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలిపి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. 2019 ఫిబ్రవరిలో విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించింది. అప్పటినుంచి ఇప్పటివరకు విశాఖ రైల్వే జోన్‌కు కేవలం రూ.3.40 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. దీనికి రైల్వే శాఖ ఓఎస్‌డీని నియమించగా.. జోన్‌ నిర్మాణానికి రూ.169 కోట్లు అవసరమని సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) రూపొందించారు. అయితే ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకుంది. రైల్వే జోన్‌ ఇంకా డీపీఆర్‌ దశలోనే ఉందని పార్లమెంట్‌లో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల ప్రకటించారు. డీపీఆర్‌ పరిశీలనలో ఉన్నందున జోన్‌ కార్యాచరణకు కాల పరిమితి నిర్ణయించలేదన్నారు. వాల్తేరు డివిజన్‌ను పూర్తిగా జోన్‌లోకి చేర్చాలన్న అంశంపై కేంద్రం నాన్చివేత ధోరణి అవలంబిస్తోంది.

చంద్రబాబు హయాంలో ఈస్ట్‌కోస్ట్‌లో విలీనం
ఆదాయం విషయంలో వాల్తేరు డివిజన్‌ దేశంలో 4వ స్థానంలో ఉండేది. సరకు రవాణా, టికెట్‌ విక్రయాల ద్వారా రూ.7 వేల కోట్లకు పైగా ఈ డివిజన్‌ నుంచే రైల్వేకు ఆదాయం సమకూరేది. 2003లో చంద్రబాబు సీఎంగా.. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నారు. ఆ సమయంలోనే ఒడిశా కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌లో అధికంగా ఆదాయం ఉన్న వాల్తేరు డివిజన్‌ను విలీనం చేశారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నోరెత్తలేదు. విశాఖ నుంచి ప్రధాన డివిజన్‌ను ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌లో విలీనం చేసినా.. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్రంలో అధిక ఆదాయం గల వాల్తేరు డివిజన్‌ను భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌ కోస్ట్‌ జోన్‌లో 2003లో కలపడంతో ఆ జోన్‌కు వాల్తేరు డివిజన్‌ ప్రధాన ఆదాయ వనరుగా మారింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు