అమితానందం..పండుగలా ఫించన్ల పంపిణీ

2 Jan, 2023 10:29 IST|Sakshi

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: పడిగాపులు.. ఎదురుచూపుల బాధ పోయింది. పొలంలో ఉన్నా.. పనుల్లో ఉన్నా.. అవసరాల నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లినా.. ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా అక్కడకు వలంటీర్‌ ద్వారా పింఛన్‌ చేరుతోంది. ప్రభుత్వ ఉద్యోగి అందుకునే జీతం లాగా ఒకటో తేదీనే ఠంచన్‌గా అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, మత్స్యకార, చర్మకార, కల్లుగీత కార్మికులకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక అందుతోంది. పాదయాత్రలో ఇచ్చిన మాట, ఎన్నికల మేనిఫెస్టోలోని హామీని జగనన్న ప్రభుత్వం నిలబెట్టుకుంటూ బాసటగా నిలుస్తోంది.

ఎన్నికల సమయంలో ఉన్న రూ.2వేల పింఛన్‌ను దశలవారీగా రూ.3వేలకు పెంచుతామన్న హామీని మూడో ఏడాదీ అమలు చేసింది. రూ.2,500 నుంచి రూ.2,750కు పెంచిన పింఛన్‌ను ఆదివారం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణలో పంపిణీ చేశారు. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు తలుపుతట్టి ‘పింఛన్‌’  అంటూ డబ్బు అందజేశారు. నాడు పింఛన్‌ కోసం ఎన్ని అగచాట్లు పడ్డామో తలచుకుని.. నేడు ఉన్న చోటుకే వచ్చి ఇస్తున్న పింఛన్‌ విధానాన్ని బేరీజు వేసుకుని లబ్ధిదారులు అమితానందభరితులయ్యారు. పింఛన్‌ పెంపుతో తమకు సామాజిక భద్రతతో పాటు గౌరవం మరింత పెంచిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపి.. చల్లగా ఉండాలని ఆశీర్వదించారు.


రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం తిమ్మాపురంలో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న పింఛన్‌దారులు 

జనవరి నెలకు సంబంధించి 2,79,309 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. కొత్తగా 10,143 మందికి పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. రూ.77.97 కోట్ల పింఛన్‌ నిధులు విడుదలయ్యాయి. తొలిరోజు బుక్కరాయసముద్రం 86.52 శాతం, పామిడి అర్బన్‌ 85.30, నార్పల 84.68, అనంతపురం అర్బన్‌ 84.20, శింగనమల 83.46, పెద్దవడుగూరు 82శాతం, పుట్లూరు, ఉరవకొండ 81.61శాతం, తాడిపత్రి అర్బన్, గుంతకల్లు అర్బన్, రాయదుర్గం అర్బన్, గుత్తి అర్బన్‌లో 80 శాతంతో పింఛన్ల పంపిణీలో ముందంజలో ఉన్నాయి. రాప్తాడు 53.78, ఆత్మకూరు 55.19, బ్రహ్మసముద్రం 62.79, రాయదుర్గం 62 శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నాయి.  

ఏడో తేది వరకు ఫింఛన్ల పండుగ
ఫింఛన్‌ రూ.2750కు పెంచడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నాయి. కొత్తగా మంజూరైన 10,143 పింఛన్లు కూడా ఈ నెల నుంచి అందిస్తున్నాం. మండల, మున్సిపల్‌ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. తొలిరోజు 82.03 శాతం మందికి పింఛన్‌ అందించాం. ఏడో తేదీ వరకు పింఛన్ల పండుగ కొనసాగుతుంది. ఆలోపే వంద శాతం పంపిణీ పూర్తి చేస్తాం. 
– నరసింహారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్‌డీఏ 

(చదవండి: ఇంతవరకూ ఓపిక పట్టా.. ఇకపై సహించే ప్రసక్తే లేదు: కేతిరెడ్డి)
 

మరిన్ని వార్తలు