బాబు కూల్చారు.. జగన్‌ పునర్నిర్మించారు

8 Dec, 2023 04:07 IST|Sakshi

8 ఆలయాలను పునః నిర్మించి ప్రారంభించిన ముఖ్యమంత్రి 

ఇంద్రకీలాద్రి (విజయవాడపశ్చిమ): కృష్ణా పుష్కరాల పేరిట 2016లో విజయవాడలో టీడీపీ సర్కారు కూల్చి వేసిన 8 ఆలయాలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పునర్‌ నిర్మించి ప్రారంభించింది. నాడు పుష్కరాల సమయంలో చంద్రబాబు సర్కారు కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణం, అమ్మవారి ఆలయానికి చేరుకునే మార్గంలోని మొత్తం 13 ఆలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేసింది.

చంద్రబాబు సర్కారు కూల్చి వేసిన ఆలయాలను పునర్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌ ఎనిమిది ఆలయాలకు 2021 జనవరి 8వ తేదీన శంకుస్థాపన చేశారు. దక్షిణాముఖ ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మవారి పాదాలు,  శ్రీసీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయస్వామి ఆలయం, వీరబాబు ఆలయం, విజయవాడ గో సంరక్షణ సంఘం కృష్ణ మందిరం, బొడ్డు బొమ్మ, ఆంజనేయస్వామి ఆలయం వినాయకస్వామి ఆలయం తొలి మెట్టు, శ్రీశనైశ్వర స్వామి వారి ఆలయాల పునర్‌ నిర్మాణాన్ని రూ.3.87 కోట్లతో చేపట్టి పూర్తి చేశారు. తాజాగా వీటిని ప్రారంభించారు.

మిగిలిన ఐదు ఆలయాలలో ప్రధానమైన మౌన స్వామి వారి విగ్రహాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి ప్రాంగణంలో తిరిగి ఏర్పాటు చేయగా పాత మెట్ల మార్గంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయం, మల్లేశ్వర స్వామి వారి మెట్ల మార్గంలోని వీరాంజనేయ స్వామి ఆలయాల్లో విగ్రహాలను బ్రాహ్మణ వీధిలోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఆలయాల్లో ఉంచి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు