‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా

23 May, 2023 21:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. టెన్త్, ఇంటర్ టాపర్లకు జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రోత్సాహకాలు, సత్కార కార్యక్రమాలని నిర్వహించాలని ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నెల 25 నియోజకవర్గాలు, 27 న జిల్లా కేంద్రాలు, 31 న రాష్ట్ర స్ధాయి కార్యక్రమం నిర్వహించాలని మొదటగా నిర్ణయించగా, అయితే ఈ కార్యక్రమాలని పాఠశాలలు పున: ప్రారంభం తర్వాత జరపాలని తాజాగా  ప్రభుత్వం  ప్రకటించింది. విద్యార్ధులు, వారి తల్లితండ్రుల‌ కోరిక మేరకు వాయిదా ప్రభుత్వం వాయిదా  వేసింది. పాఠశాలలు రీ ఓపెన్ తర్వాత జరిపితే ఎక్కువ మంది హాజరై స్పూర్తిదాయకంగా ఉంటుందని తల్లిదండ్రులు విజ్ణప్తి చేశారు. జూన్ 12 తర్వాత ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు.

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు (స్టేట్‌ బ్రిలియన్స్‌ అవార్డ్స్‌)’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. ఈ అవార్డుల వేడుకను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో నడుస్తున్న పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో 2023 మార్చి, ఏప్రిల్‌ పబ్లిక్‌ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు అవార్డులతో ప్రభుత్వం సన్మానించనుంది.
చదవండి: నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

ఇంటర్‌ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించనుంది. విద్యా రంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. మూడు స్థాయిల్లోనూ విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్‌ సర్టిఫికెట్‌ ఇవ్వనుంది. సంబంధిత పాఠశాలకు మెమెంటోతో పాటు  ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు. 

మరిన్ని వార్తలు