6 జిల్లాల్లో జగనన్న భూరక్ష సర్వే ఫోర్స్‌

22 Aug, 2022 04:35 IST|Sakshi

2,225 ప్రత్యేక బృందాల ఏర్పాటు 

యుద్ధప్రాతిపదికన రీ సర్వేకు ఏర్పాట్లు 

ప్రతి బృందంలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, ఒక వీఆర్‌వో, ఒక వీఆర్‌ఏ

సాక్షి, అమరావతి: భూముల రీసర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం జగనన్న భూరక్ష సర్వే ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆరు జిల్లాల్లో 2,225 బృందాలను ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ బృందాలు పనిచేస్తున్నాయి. ఈ జిల్లాల పరిధిలో భూమి ఎక్కువ ఉంది. సర్వేకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం ఉండడంతో ఈ బృందాలను నియమించారు. అవసరం మేరకు ఈ జిల్లాల్లోని కొందరిని డిప్యూటేషన్‌పై పక్క జిల్లాల బృందాల్లో నియమించారు. ప్రతి బృందంలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, ఒక వీఆర్‌వో, ఒక వీఆర్‌ఏ ఉంటారు. ఈ బృందం ప్రతిరోజూ 20 నుంచి 30 ఎకరాల్లో క్షేత్ర స్థాయి సర్వే చేయాలి.  

రోజుకు 50 వేల ఎకరాల సర్వే 
ఈ బృందాల ద్వారానే రోజుకు 50 వేల ఎకరాల సర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటివరకు ఏ జిల్లాల పరిధిలోని ఉద్యోగులతో ఆ జిల్లాల్లోనే సర్వే చేయించారు. సర్వే జరిగే గ్రామంలో 20 నుంచి 30 మంది సర్వేయర్లు, ఒక వీఆర్‌వో, ఒక వీఆర్‌ఏతో కూడిన బృందాన్ని వినియోగించారు. గ్రామంలో క్షేత్ర స్థాయి సర్వే పూర్తయ్యాక మరో గ్రామానికి ఈ బృందాలను పంపుతున్నారు. పక్క మండలాల్లోని సర్వేయర్లను కూడా వినియోగిస్తున్నారు. ఈ బృందాలు కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా రీసర్వేలో నిమగ్నమయ్యాయి.

ప్రధానంగా గ్రామ సర్వేయర్లే కీలకం  
గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 11,118 గ్రామ సర్వేయర్లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. రీసర్వేలో వీరే అత్యంత కీలకంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారు లేకపోతే రీసర్వే పట్టాలెక్కడం కూడా సాధ్యమయ్యే పని కాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గ్రామానికి ఒక సర్వేయర్‌ ఉండాలని  ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వీరిని నియమించింది. ఈ గ్రామ సర్వేయర్లే వైఎస్సార్‌ జగనన్న భూహక్కు, భూరక్ష పథకానికి వెన్నెముకలా నిలబడ్డారు. వారితోనే వేల బృందాలను నియమించి రీసర్వే చేయిస్తున్నారు. 

మరిన్ని వార్తలు