చిరు వ్యాపారులకు నేడు ‘జగనన్న తోడు’

25 Nov, 2020 03:01 IST|Sakshi

36–60 శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకుని నష్టపోతున్న చిరు వ్యాపారులు

పాదయాత్రలో వారి కష్టాలను స్వయంగా చూసిన వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రోజువారీ వ్యాపారాలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి అప్పులు తెచ్చుకుని, రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ములో అధిక శాతం.. ఆ అప్పులకు వడ్డీ చెల్లించేందుకే వెచ్చిస్తున్న చిరు వ్యాపారులను ఆదుకుంటానని భరోసా ఇచ్చిన వైఎస్‌ జగన్‌.. నేడు ఆ మాట నిలుపుకోనున్నారు. చిన్న చిన్న అప్పుల కోసం వీధి వ్యాపారులు పడుతున్న అవస్థలను తన పాదయాత్రలో స్వయంగా చూసిన ఆయన, అధికారంలోకి రాగానే వారి ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ‘జగనన్న తోడు’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.   
జగనన్న తోడు పథకానికి ఎంపికైన వెయ్యి మంది చిరు వ్యాపారులు తమ తోపుడు బండ్లతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో 50 అడుగుల సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. – శ్రీకాళహస్తి 

అధిక వడ్డీల నుంచి విముక్తి
► చిరు వ్యాపారులు 36–60 శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకుని అష్టకష్టాలు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని అమలు చేస్తున్నారు. రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులు ఈ రుణానికి అర్హులు.
► వీరితో పాటు చేతి వృత్తి దారులైన లేస్‌ వర్క్, కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మల తయారీదారులు, కళాకృతులతో కూడిన కుండల తయారీదారులు, బొబ్బిలి వీణలు, కంచు విగ్రహాలు, కళాత్మక వస్తువుల తయారీదారులు వంటి సంప్రదాయ వృత్తి కళాకారులకు సైతం వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి రూ.పది వేలు రుణం లభిస్తుంది.  
► ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను  సచివాలయాల వద్ద ప్రదర్శిస్తున్నారు. అన్ని అర్హతలున్న వారెవరైనా జాబితాలో తమ పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. నెల రోజుల్లోపు పరిశీలించి రుణం మంజూరు చేస్తారు. చిరు వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికీ రుణాలందిస్తారు. సమన్వయం, పర్యవేక్షణకు ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. లబ్ధిదారుడు తాను తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించిన తర్వాత, సదరు వడ్డీని ప్రభుత్వం లబ్ధిదారుడికి రీయింబర్స్‌ చేస్తుంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా