లోక కల్యాణం.. పచ్చతోరణం

26 Jul, 2021 08:43 IST|Sakshi

పర్యావరణం.. పచ్చదనం.. ఈ మాటలు ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.. కాలుష్యపు కోరల నుంచి బయటపడేందుకు  ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అందరినీ భాగస్వాములు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సారి జిల్లాలో అధికారులు వినూత్నంగా విత్తన    బంతులతో మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. 
సాక్షి, కడప: రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎక్కడ చూసినా మొక్కలతోపాటు పచ్చదనం కళకళలాడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జగనన్న పచ్చతోరణం పథకం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు కృషి చేస్తోంది. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటేందుకు సన్నద్ధమైంది. ఎక్కడ చూసినా మొక్కలు నాటడం మూలంగా వర్షాలతోపాటు ప్రకృతిపరంగా అనేక ప్రయోజనాలు ఒనగూరేందుకు అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఆరంభ శూరత్వంగా మొక్కలు నాటి వదిలేసినా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొక్కల పెంపకానికి చర్యలు చేపడుతోంది.  మొక్కలు నాటడం ద్వారానే పర్యావరణ ప్రయోజనంతోపాటు ప్రకృతి ద్వారా కూడా అనేక లాభాలు లభిస్తాయని భావిస్తూ అందరినీ భాగస్వాములను చేస్తోంది. అందులో భాగంగా డ్వామా, పంచాయతీ, అటవీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, జిల్లా పరిషత్‌ల ద్వారా సమన్వయం చేసుకుంటూ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. జిల్లాలో సుమారు 30 లక్షల పైచిలుకు మొక్కలను ఆగస్టు 15వ తేదీలోగా నాటేలా కసరత్తు చేస్తున్నారు.  
1200 కిలో మీటర్ల మేర.. 
జిల్లాలో జగనన్న పచ్చతోరణం కింద మొక్కల పెంపకానికి భారీ ఎత్తున ప్రణాళిక రూపొందిస్తున్నారు.  ఒక పంచాయతీ నుంచి మరో పంచాయతీకి అనుసంధానంగా ఉన్న రోడ్లతోపాటు పంచాయతీ నుంచి మండల కేంద్రానికి వెళ్లే మార్గం, రాష్ట్ర రహదారులు ఇలా  ప్రతి చోట మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగం సంకల్పించింది.  సుమారు 1200 కిలోమీటర్ల మేర ఐదు లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నారు. మొక్కలను సంరక్షించేందుకు గ్రామ పంచాయతీలో ఒక వాచర్‌ (ఉపాధి కూలీ)ని ఎంపిక చేసి....250 మొక్కలను సంరక్షించే బాధ్యతను అప్పగిస్తున్నారు. నెలకు నాలుగుసార్లు నీళ్లు అందించాల్సి ఉంటుంది.  
సర్పంచ్‌ ఆధ్వర్యంలో కమిటీ 
గ్రామాలో ఎక్కడా ఒక్క మొక్క కూడా చనిపోకుండా ఉండేందుకు సర్పంచ్‌ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. సర్పంచ్‌తోపాటు సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు కమిటీలో ఉంటారు. అలాగే ఉపాధి హామీ అధికారులందరికీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. మొక్క చనిపోతే బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోనున్నారు.  
నియోజకవర్గానికి ఓ విలేజ్‌ పార్కు 
జిల్లాలోని పది నియోజకవర్గాలకుగాను కార్పొరేషన్‌ మినహా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో విలేజ్‌ పార్కులను అధికారులు ఎంపిక చేశారు.  అక్కడ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.  
ప్రభుత్వ కార్యాలయాల్లో 
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాలు, పాఠశాలలు, ఇతర సంస్థల్లో దాదాపు రెండు లక్షల మేర మొక్కలు నాటనున్నారు.  
మండలానికి రెండు బ్లాక్‌ ప్లాంటేషన్లు జిల్లాలో ప్రతి మండలంలోనూ రెండు బ్లాక్‌ ప్లాంటేషన్లను ఎంపిక చేశారు. ఒక్కో బ్లాక్‌ ప్లాంటేషన్‌లో 200 మొక్కలు నాటనున్నారు. జిల్లాలోని సుమారు 100కు పైగా బ్లాక్‌ ప్లాంటేషన్లను అభివృద్ధి చేసి సుమారు 20 వేలకు పైగా మొక్కలు నాటాలని సంకల్పించారు.  
ప్రతి మొక్కను కాపాడుతాం 
జిల్లాలో ఈసారి కొత్తగా విత్తన బంతుల ద్వారా కూడా మొక్కలను అభివృద్ధి చేస్తున్నాం. మొక్కల సంరక్షణ బాధ్యతను పలువురికి అప్పగించాం. జిల్లాలో 30 లక్షలకు పైగా మొక్కలను నాటుతున్నాం.
యదుభూషణరెడ్డి, పీడీ, డ్వామా, కడప  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు