ఒక్కొక్కరు ఒక్కో మొక్క!

24 Jan, 2021 09:57 IST|Sakshi

20 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం

ఇప్పటికే 9.50 కోట్ల మొక్కలు నాటిన వైనం

పచ్చదనం (గ్రీన్‌ కవర్‌) పెంపుదలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముందంజలో ఉంది. జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు వై ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్‌ కవర్‌ సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 2020– 21లో ‘జగనన్న పచ్చతోరణం’ పథకం కింద 20 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం. ఇప్పటికే 9.50 కోట్ల మొక్కలు నాటడం పూర్తయింది. 

మొక్కలు నాటి.. చేతులు దులుపుకోవడం కాకుండా గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం గత ఏడాది జులై 20న ఉత్తర్వులు జారీ చేసింది. నాటిన వాటిలో కనీసం 85 శాతం మొక్కలు చెట్లుగా ఎదిగేలా పరిరక్షణ చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పశువుల నుంచి రక్షణ కోసం నాటిన ప్రతి మొక్కకూ ట్రీ గార్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో పచ్చదనం
‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 28.30 లక్షల మంది నివసించనున్న కాలనీలను పచ్చని పందిరిలా మార్చాలనే ఆశయంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని ప్రభుత్వం తలపెట్టింది.
విశాఖపట్నాన్ని పచ్చని మహానగరంగా తీర్చిదిద్దే చర్యలు విస్తృతంగా సాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు ‘గ్రీన్‌ విశాఖ’ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మొక్కలు నాటుతున్నట్లు విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ కోటేశ్వరరావు తెలిపారు.
ఈ నేపథ్యంలో నాటిన ప్రతి మొక్కను బిడ్డలా సంరక్షించి సజావుగా పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గ నిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ‘ఒక్కొక్కరు ఒక్కో మొక్క’ నాటి సంరక్షించాలనే నినాదాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.
పచ్చదనం పెంపునకు గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల సేవలను వినియోగించుకుంటోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రాహదారులు, గ్రామీణ రోడ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు.

నర్సరీల్లో 6 కోట్ల మొక్కల పెంపకం
రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర అటవీ శాఖ సామాజిక అటవీ విభాగానికి చెందిన 737 నర్సరీల్లో 2020లో 6.03 కోట్ల మొక్కలు పెంచారు. గత ఏడాది (2020) జులై 22న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సీఎం జగన్‌  మొక్కలు నాటి జగనన్న పచ్చతోరణానికి శ్రీకారం చుట్టారు.
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజం కోసం ఇప్పటికే దేశంలోనే మొట్టమొదటిగా ‘ఆన్‌లైన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫాం’ అమల్లోకి తెచ్చిన సీఎం జగన్‌ పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
రాష్ట్ర అటవీ శాఖ నోడల్‌ ఏజెన్సీగా 29 ప్రధాన శాఖల ద్వారా 2020–21లో 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛంద సంస్థలు, వనసంరక్షణ సమితులు, స్వయం సహాయక సంఘాలు, పేపర్‌ మిల్లులతోపాటు అన్ని వర్గాల ప్రజలను ఈ మహాక్రతువులో భాగస్వాములను చేస్తోంది.
రాష్ట్రంలో 1,62,968 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం ఉండగా 37,258 చదరపు కిలో మీటర్ల (మొత్తం భూభాగంలో 23 శాతం) మేర అటవీ ప్రాంతం ఉంది. దీంతో పాటు అడవి వెలుపల మూడు శాతం గ్రీన్‌ కవర్‌ ఉంది. అంటే, 26 శాతం గ్రీన్‌ కవర్‌ ఉన్నట్లు లెక్క. దీన్ని 33 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
– లేబాక రఘురామిరెడ్డి, సాక్షి, అమరావతి

అటవీ విస్తీర్ణం పెంపులో ఏపీ సెకండ్‌!
దేశ వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెంపుదలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ద్వితీయ స్థానంలో నిలవడం గమనార్హం. 16వ భారత అటవీ నివేదిక (ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ 2019) ప్రకారం 1,025 చదరపు కిలోమీటర్ల గ్రీన్‌ కవర్‌ పెంపు ద్వారా కర్ణాటక దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 990 కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెంపుతో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలోనూ, 823 కిలోమీటర్ల పెంపుతో కేరళ తృతీయ స్థానంలోనూ నిలిచాయి. ప్రతి రెండేళ్లకోసారి దేశంలో అటవీ విస్తీర్ణం, వనరుల వినియోగంపై భారత అటవీ సర్వే (ఎఫ్‌ఎస్‌ఐ) విభాగం ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ నివేదికను వెల్లడిస్తుంది. 2017 –18 సంవత్సరాలతో పోల్చితే 2019 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ విస్తీర్ణం 990 చదరపు కిలోమీటర్లు పెరగడం విశేషం. గత ఏడాది జులై 22వ తేదీ నుంచి ఇప్పటి వరకూ వివిధ విభాగాల ద్వారా 9.50 కోట్ల మొక్కలు నాటడం విశేషం. వాటి వివరాలిలా ఉన్నాయి.

జిల్లాల వారీగా నాటిన మొక్కలు(లక్షల్లో)
అనంతపురం 61.861
చిత్తూరు 87.645
గుంటూరు 32.281
నెల్లూరు 9.487
ప్రకాశం 60.046
వైఎస్సార్‌కడప 20.342
కర్నూలు 36.282
పశ్చిమ గోదావరి 170.020
తూర్పుగోదావరి 56.016
కృష్ణా 36.628
శ్రీకాకుళం 92.431
విశాఖపట్నం 162238
విజయనగరం 124.978
మొత్తం 950.255

నాలుగు రకాల ప్లాంటేషన్‌
పచ్చదనం పెంపులో భాగంగా ప్రభుత్వం నాలుగు రకాల ప్లాంటేషన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఎవెన్యూ ప్లాంటేషన్‌ : జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రహదారులు తదితర చోట్ల మొక్కలు నాటడాన్ని ఎవెన్యూ ప్లాంటేషన్‌ అంటారు. చింత, వేప, మర్రి, కానుగ, రావి, బాదం, నిద్రగన్నేరు, ఏడాకులపాయ, నేరేడు తదితర మొక్కలను ఈ ప్లాంటేషన్‌కు వినియోగిస్తారు.
బ్యాంక్‌ ప్లాంటేష‌న్‌ : స్థానిక పరిస్థితులు, భూమిని బట్టి సాగునీటి కాలువల వెంబడి సుబాబుల్, టేకు, జామాయిల్, వేప, మలబార్‌ నీమ్, బాదం తదితర మొక్కలను నాటుతారు.
బ్లాక్‌ ప్లాంటేషన్‌ : చెట్లు క్షీణించిన అటవీ ప్రాంతం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, రెవెన్యూ పోరంబోకు, దేవాలయ భూములు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర సంస్థల ప్రాంగణాల్లో
మొక్కలు నాటడాన్ని బ్లాక్‌ ప్లాంటేషన్‌ అంటారు. ఆయా అటవీ ప్రాంతాల వాతావరణం, నేల పరిస్థితులను బట్టి ఎర్ర చందనం, శ్రీగంధం, మోదుగ,  నేరవేప, రోజ్‌ఉడ్, మద్ది, నీరుద్ది, ఏగిస తదితర మొక్కలు పెంచుతారు.
ఇళ్లు, పొలాలు: ఇళ్ల వద్ద, పొలం గట్లపైనా నాటుకోవడం కోసం అటవీ శాఖ మొక్కలు ఇస్తుంది. సాధారణంగా రైతులు వేప, చింత, ఎర్రచందనం, టేకు, శ్రీగంధం, ఉసిరి, మామిడి, దానిమ్మ, జామ, సపోటా తదితర మొక్కలను ఇష్టపడుతుంటారు.

మరిన్ని వార్తలు